ప్రజాశక్తి- అరకులోయ రూరల్:పేదలకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం వహించిన డిపో సేల్స్ మెన్, డీలర్ పై చర్యలు తీసుకోవాలని అరకులోయ మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం గిరిజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకులు పాంగి నానిబాబు, సిహెచ్ గురుమూర్తి మాట్లాడుతూ, మండలంలోని సుంకరమెట్ట పంచాయతీ పరిధి దండబాడు, దుక్కగుడా గ్రామాలకు డిసెంబర్ నెలలో పంపిణీ చేయవలసిన ఉచిత బియ్యం 100 మంది రేషన్ కార్డు దారులకు నేటికీ పంపిణీ చేయలేదన్నారు. గిరిజన ప్రాంతంలో రేషన్ బియ్యంపై పేద ప్రజలు ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. అరకులోయ మండలంలోని డిపో పరిధిలో జిసిసి మేనేజర్ పర్యవేక్షణ లేక పోవడంతో ఉచిత బియ్యాన్ని పక్క దారి పట్టిస్తున్నారని వాపోయారు.తక్షణమే సేల్స్ మెన్, డీలర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ కె.దేవన్న, రేషన్ కార్డుదారులు కృష్ణ, రాజు తదతరులు పాల్గొన్నారు.










