ప్రజాశక్తి-మారేడుమిల్లి
గిరిజనులు సమస్యలపై విస్తృతంగా పోరాటాలు నిర్వహించాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర, రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం పిలుపునిచ్చారు. గిరిజన సంఘం రంపచోడవరం జిల్లా ద్వితీయ మహాసభ రంపచోడవరం స్వర్ణభారతి మైదానంలోని సున్నం రాజయ్య, కుంజా బొజ్జి నగర్‌లో సోమవారం జరిగింది. మహాసభ ప్రారంభ సూచికగా గిరిజన సంఘం జెండాను సీనియర్ నాయకులు నక్కా సూరిబాబు ఆవిష్కరించారు. అనంతరం అమరవీరులైన ఆదివాసీ ఉద్యమనాయకులు మాజీ ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, కుంజ బొజ్జి చిత్రపటాలకు రాష్ట్ర నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని ప్రవేశ పెట్టిన తీర్మాన్ని జిల్లా మహాసభ ఆమోదించింది. ఈ సందర్భంగా సురేంద్ర, సీతారాం మాట్లాడుతూ బోయ వాల్మీకులు ఎస్టీ జాబితాలో చేర్చే జీవో నెంబర్ 52ను తక్షణమే రద్దు చేయాలన్నారు. జీవో నెంబర్ 3కు చట్టబద్ధత కల్పించాలని, 1/70 చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితులకు సంపూర్ణంగా పునరావాసం కల్పించాలని, అటవీకుల చట్టం 2006ను ప్రతిష్టంగా అమలు చేయాలని, కేంద్ర ప్రభుత్వం అటవీ సంవరక్షణ చట్టాన్ని సవరణ చేస్తూ తీసుకొస్తున్న నూతన అటవీ సంరక్షణ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని గిరిజన భాషా వాలంటీర్లను నియమించాలని కోరారు. నూతన కమిటీ ఆధ్వర్యంలో పై సమస్యలపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
జిల్లా అధ్యక్ష, కార్యదర్శులుగా సిరిమల్లిరెడ్డి, సంతోష్ ఎన్నిక
ఈ మహాసభలో 24 మందితో నూతన జిల్లా కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఈతపల్లి సిరిమల్లి రెడ్డి, పులి సంతోష్, కార్యదర్శివర్గ సభ్యులుగా పూనెం ప్రదీప్ కుమార్, బాబు బురయ్య, కారం నాగేశ్వరరావు, కాక అర్జున్ దొర, ఆఫ్క సమ్మక్క, కోండ్ల సూరిబాబు, తీగల శ్రీనివాస్, ఇరుప అర్జున్, 14 మంది కమిటీ సభ్యులు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.కిరణ్, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మట్ల వాణిశ్రీ, పల్లపు వెంకట్, 11 మండలాల నుంచి 200 మంది ప్రతినిధులు పాల్గొన్నారు.










