
ప్రజాశక్తి - సీతంపేట : గిరిజనులకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ, వారి సమస్యలపై నిత్య సేవకుడుగా పనిచేస్తున్నారు మండలంలోని పెద్దపల్లకి వలస గ్రామానికి చెందిన గేదెల రవి. ఉన్నత చదువులు చదివిన ఆయన త్రిబుల్ ఐఐఐటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ తనకున్న చదువును అందరికీ పంచుతూ, అందర్నీ అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో గిరిజనులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు మన్య ప్రగతి సంస్థని స్థాపించారు. దీనిద్వారా గ్రామదర్శిని పేరిట మన్యంలోని అన్ని గ్రామాలను సందర్శించి అక్కడి గిరిజనులు పడుతున్న అవస్థలను తెలుసుకొని ఆ సమస్యలను అధికారుల వద్దకు తీసుకుని వెళ్లి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నారు.
గ్రామ దర్శిని - ప్రజా చైతన్య అవగాహనా కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలు, గిరిజన చట్టాలు, గిరిజన, మహిళా హక్కులు, గిరిజన సంక్షేమ పథకాలు అమలు సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదా ప్రజలకు అందుతున్నాయా లేదా అడిగి తెలుసు కొని అవి వారికి అందేలా కృషి చేస్తున్నారు. అలాగే నిరుద్యోగ సమస్య, గ్రామాల్లో మౌలిక సదుపాయాల సమస్యల కల్పన తదితర సమస్యలను గుర్తించి స్పందనలో అధికారుల వద్దకు వెళ్లి పరిష్కారానికి ప్రయత్నిస్తున్నారు. వీటితో పాటు గిరిజన సంస్కృతి - సాంప్రదాయం, గిరిజన భాషల పరిరక్షణపై కృషి చేస్తున్నారు. జీవో 3 పునరుద్దరణ, బోయ - వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చడం వల్ల నష్టాలపైనా, ఐదో షెడ్యూల్డ్ ఏరియాలోని భూ సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజా చైతన్య అవహగాన కార్యక్రమం నేటికీ 285వ రోజులు గ్రామదర్శి ద్వారా పూర్తి చేసుకున్నారు. సామాజిక సేవల్లో భాగంగా నిరుపేదలు, గిరిజన గర్భిణీల కోసం 30 మంది వరకు అత్యవసర ఆపరేషన్ సమయంలో బ్లడ్ ఏర్పాట్లు చేసి రక్తదానం దానం చేసి ప్రాణాలు కాపాడారు. ఉద్యోగ, ఉన్నత విద్యపై గిరిజన నిరుద్యోగులు, విద్యార్థుల కోసం సెమినార్లు ఏర్పాటు చేసి వారి ఉన్నత విద్యకు తన వంతుగా అలుపెరుగని కృషి చేస్తున్నారు. తాను చేస్తున్న సామాజిక సేవలకు ప్రజలు, అధికారులు మరింత తోడ్పాటును అందించాలని కోరుతున్నారు.