Nov 04,2022 23:48

సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే, వివిధ శాఖల అధికారులు

ప్రజాశక్తి-రాజవొమ్మంగి
ఏజెన్సీలోని గిరిజన రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని రంపచోడవరం ఐటిడిఎ ప్రాజెక్ట్‌ అధికారి సూరజ్‌ గనోరే సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం పిఒ తన ఛాంబర్‌లో వ్యవసాయ అనుబంధ శాఖలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ శాఖలు అధికారులు ముందుగా ఐదు గ్రామాలను ఎంపిక చేసుకుని అక్కడి రైతులతో మమేకమై వారికి మక్కువ ఉన్న పంటలపై అవగాహన కల్పించాలని సూచించారు. గిరిజన రైతులు ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు అందజేసేందుకు ఏ చర్యలు తీసుకున్నది వ్యవసాయ శాఖ అధికారులను పిఒ అడిగి తెలుసుకున్నారు. ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాల భూములలో ఏ వ్యవసాయం చేస్తున్నదీ, గతంలో గిరిజన రైతులకు ఐటిడిఎ ద్వారా అందించిన పవర్‌ టిల్లర్లు, మినీ రైస్‌ మిల్స్‌, ట్రాక్టర్లు, రోటవేటర్లను రైలులు ఏ విధంగా ఉపయోగిస్తున్నారో ఆరా తీశారు. గిరిజన రైతులందరికీ ఈ-క్రాప్‌ నమోదు తప్పనిసరిగా చేయాలన్నారు. గిరిజన రైతులకు అపరాల పంటలు వేసుకొనే విధంగా ప్రోత్సహించాలన్నారు. వెలుగు, హార్టికల్చర్‌ శాఖల ద్వారా వందన్‌ వికాస కేంద్రాలతో ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఏజెన్సీలోని మహిళా సంఘాలకు ఎన్ని యూనిట్లు కోళ్లు ఐటీడీఏ ద్వారా అందజేసింది, ప్రస్తుతం ఏ దశలో ఉన్నవి అడిగి తెలుసుకున్నారు. పట్టు పరిశ్రమ శాఖ ద్వారా ఏయే గ్రామాలలో వ్యవసాయం చేస్తున్నదీ, ఎంత మంది గిరిజనులు, ఎన్ని ఎకరాలలో చేస్తుందని ఆరా తీశారు. మత్స్యశాఖ ద్వారా రైతులకు ఏయే సేవలందిస్తున్నదీ, పందిరిడి మామిడి చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ద్వారా ఇప్పటివరకు ఎంతమంది గిరిజనులకు చేప పిల్లలు సరఫరా చేసిందీ, ఎన్ని ఎకరాలలో మత్స్యశాఖ వ్యవసాయం చేస్తున్నదీ తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. మారేడుమిల్లి, వై.రామవరం మండలాల్లో జాప్ర సాగు తీరుపై ఆరా తీశారు. ఈ సమావేశంలో వెలుగు ఏపీడి ఎ.శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్లు సిహెచ్‌కెవి చౌదరి, కె.సావిత్రి, జిసిసి సీనియర్‌ మేనేజర్లు పార్వతీశం, ముర్ల రాజారెడ్డి, జి.చంద్రశేఖర్‌, వెలుగు యాంకర్‌ పర్సన్‌ రామరాజు, సెరీకల్చర్‌ డిప్యూటీ డైరెక్టర్‌ బిఎంయు.రామరాజు, ఏఎస్‌ఓ కె.రంగారావు తదితరులు పాల్గొన్నారు.