Feb 12,2023 00:05

మాట్లాడుతున్న దొన్నుదొర

ప్రజాశక్తి-హుకుంపేట: ఆయిల్‌ ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతి చెందిన పెదబయలు మండలంలోని బాధిత ఒక్కో కుటుంబానికి కోటి రూపాయల పరిహారం చొప్పున పరిహారం చెల్లించాలని టిడిపి ఎస్టి సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు సివేరి దొన్ను దొర డిమాండ్‌ చేశారు. గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు గిరిజన ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లేక మైదాన ప్రాంతంలో వలస కూలీలుగా కుటుంబ పోషణం కోసం జీవనం సాగించేందుకు గిరిజన రైతులు యువతీ యువకులు తరలి పోతున్నారని ఆయన వాపోయారు. గిరిజన రైతు కూలీలు మైదాన ప్రాంతానికి వెళ్లి ప్రమాదాలతో శవాలుగా గ్రామాలకు వస్తుండటంపై ఆవేదన వ్యక్తం చేశారు.ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఉపాధి హామీ పథకాల ద్వారా పని దినాలు 200 రోజులు పెంచాలని ఆయన డిమాండ్‌ చేశారు. పని దినాలు తక్కువ చేసి కూలి లేకుండా చేయడం సరికాదన్నారు. ఉపాధి హామి పథకాలు కేవలం రైతు కూలీలకు మాత్రమే ఉపయోగించి, వారికి ఆదాయం చేకూర్చేలా చేయాలని ఆయన అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వైసీపి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు. ఇక్కడ సరిగా పనులు లేకనే మైదాన ప్రాంతాలకు గిరిజనులు తరలి పోతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.