ప్రజాశక్తి-పాడేరు: గిరిజన ప్రాంతాలలో అనేక సమస్యలు, సవాళ్లు ఉంటాయని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేసారు. ఆంధ్రప్రదేశ్ లో సుమారు 42 లక్షల మంది గిరిజనులు జీవిస్తున్నారని చెప్పారు. గ్రామ సందర్శన పర్యటనలో భాగంగా పాడేరు డివిజన్లో పర్యటిస్తున్న 2023 బ్యాచ్‌కు చెందిన ట్రైనీ ఐఎఎస్ అధికారులతో సోమవారం ఐటిడిఏ కార్యాలయంలో సమావేశ మయ్యారు.
గిరిజన ప్రాంతంలో పర్యటనకు ఎందుకు ఎంచుకున్నారని, మొదటి సారిగా ఏజెన్సీలో పర్యటిస్తున్నారా ? అని అడిగి తెలుసుకున్నారు. ఐటిడిఏ పరిధిలో సింగిల్ అడ్మినిస్ట్రేషన్ అమలవుతుందన్నారు. 2022 లో ప్రభుత్వం అల్లూరి సీతారామ రాజు జిల్లాను ఏర్పాటు చేసిందన్నారు.ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి వి. అభిషేక్ మాట్లాడుతూ, జిల్లాలో గ్రామాలను సందర్శించడంతో పరిపాలన సులభతరమౌ తుందన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలు అమలవుతున్న పథకాలపై అవగాహన కల్పించుకోవాలని చెప్పారు. అటవీ హక్కుపత్రాల పంపిణీ, మిషన్ కనెక్ట్ పాడేరు, కాఫీ ప్రాజెక్టు అమలు, రహదారుల నిర్మాణాలు, వైద్య ఆరోగ్య సేవలు, విద్యా సదుపాయాలు, వెలుగు, గిరిజన సంక్షేమ శాఖ ( ఇంజనీరింగ్) తదితర వాటిపై వివరించారు. పాడేరు ఐటిడిఏ పరిధిలో పర్యటిస్తున్న 14 మంది ట్రైనీ ఐఎఎస్ అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి అధ్యయనం చేస్తారని చెప్పారు. ఈ సమావేశంలో ట్రైనీ ఐఎఎస్ అధికారులు, డిఎఫ్‌ఓ వినోద్ కుమార్, ఐటిడిఏ సహాయ ప్రాజెక్టు అధికారులు వి.ఎస్. ప్రభాకరరావు, ఎం.వేంకటేశ్వరరావు, గిరిజన సంక్షేమ శాఖ ఇ ఇ డి. వి. ఆర్. ఎం. రాజు, డిఆర్ డిఏ పిడి వి, మురళి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా, జమాల్ భాషా, ఐటిడి ఏ పరిపాలనాధికారి ఎం. హేమలత, ఉపాధి హామీ ఎపిడి, జె. గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.










