గిరిజన ప్రాంతాలలో సమస్యలను వెంటనే గుర్తించాలి: కలెక్టర్
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:
జిల్లా వ్యాప్తంగా గిరిజనులు ఉన్న ప్రాంతాలలో సమస్యలను వెంటనే గుర్తించాలని, గంగవరం మండలం కుయ్యవంకలో ఉంటున్న గిరిజనులకు ఇంటి పట్టాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఎస్.షన్మోహన్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గిరిజనులకు ఉన్న సమస్యల, పరిష్కారం గురించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గంగవరం మండలంలోని కుయ్యవంకలో నివసిస్తున్న 18 మందికి సంబంధించి నివాసస్థలాలను మంజూరు చేయాలన్నారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా ఏనుగులు సంచరిస్తున్నందున వారికి భద్రత ఉండేలా ఆ కాలనీ చుట్టూ కందకం ఏర్పాటు చేసేందుకు ట్రైకార్ నుంచి అనుమతి పొందుతామని తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో 15మంది గిరిజనులకు ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలు ఇవ్వడం జరిగిందని దానికి సంబంధించి హద్దులు ఏర్పాటు చేయాలని అన్నారు. పలమనేరు సమీపంలోని సాంబార్‌పూర్ గ్రామానికి రోడ్డు ఏర్పాటుకు సంబంధించి 0.95హెక్టార్ల భూమిని ఇచ్చేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దేవళంపేట జగమర్ల రోడ్డు, వెదురుకుప్పం మండలంలో నక్కలపల్లి వద్ద రోడ్డు, పలమనేరు మండలంలో దొడ్డిపల్లి ఎస్టీ కాలనీకి సంబంధించి రోడ్డు సమస్యలను సమావేశంలో ప్రస్తావించారు. ఈ సందర్భంగా జిల్లా అటవీశాఖ అధికారి చైతన్య కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఏవైనా రోడ్లు 1980కి ముందు ఏర్పడి ఉంటే, ఈ ప్రాంతాలు గిరిజన ఆవాస ప్రాంతాలుగా ఉంటే వారికి వెంటనే ఇవ్వడానికి అనుమతి కోసం పంపడం జరిగిందన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.రాజశేఖర్, బైరెడ్డిపల్లి, వెదురుకుప్పం జెడ్పిటిసిలు కేశవులు, సుకుమార్, ఆర్డీఓలు రేణుక, శివయ్య, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు లక్ష్మీ ప్రసన్న, కిరణ్మయి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి మూర్తి పాల్గొన్నారు.










