Jan 05,2023 23:53

రగ్గులు పంపిణీ చేస్తున్న ఎస్‌ఐ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు

ప్రజాశక్తి- మోతుగూడెం : అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం మండలం ఒడియా క్యాంప్‌, ఇంతులూరువాగు గిరిజన గ్రామాల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ కార్యక్రమంలో ఐటిసి పరిధిలో వైడిఒ మాతృభూమి సేవా సంఘం, ఎస్‌పి యూత్‌ సొసైటీ ఆధ్వర్యంలో 150మంది గిరిజనులకు రగ్గులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సత్తిబాబు మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీస్‌ వ్యవస్థ ద్వారా పోలీస్‌శాఖల వారధిగా స్వచ్ఛంద సంస్థలు పనిచేసి గిరిజన ప్రాంతంలో ప్రజలకు సేవా కార్యక్రమాలు అందించడం, వాటిని పోలీస్‌ శాఖతో చేయించడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వైడిఒ సిఇఒ కృష్ణ మాట్లాడుతూ తమతో కలిసి గిరిజన ప్రాంతంలో సేవా కార్యక్రమాల నిర్వహణకు మాతృభూమి సేవా సంఘం, ఎస్‌పి యూత్‌ సొసైటీ కలిసిరావడంపై ఆనందం వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతంలో గత కొన్నేళ్లుగా మాతృభూమి సేవా సంస్థ ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాల నిర్వహణతోపాటు రగ్గులు పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని, అటువంటి సంస్థ తాము చేసే సేవల్లో భాగస్వామ్యం కావడంపై హర్షం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో ఎస్‌పి యూత్‌ సొసైటీ అధ్యక్షరాలు ప్రవళ్లిక, సభ్యులు శ్రీను పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజా సేవకు పోలీసులు ఎల్లవేళలా సిద్ధం
ముంచింగిపుట్టు:
అసాంఘిక కార్యకలాపాలకు గిరిజన యువత దూరంగా ఉండి మంచి మార్గంలో నడవాలని స్థానిక ఎస్‌ఐ కె.రవీంద్ర సూచించారు. గురువారం మండలంలోని మారుమూల బాబుశాల పంచాయతీ గాజులబంధ, బల్లుగూడ గ్రామాల్లో ఎస్‌ఐ కె.రవీంద్ర ఆధ్వర్యంలో ఫ్రెండ్లీ పోలీస్‌ కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలతో మమేకమై, వారితో ముచ్చటిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గంజాయి, నాటుసారా వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు, యువతకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐ కె.రవీంద్ర మాట్లాడుతూ యువత చెడుమార్గాల వైపు వెళ్లకుండా, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు. చట్ట వ్యతిరేకమైన గంజాయి సాగు, రవాణా జోలికి పోవద్దని, తద్వారా భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. పోలీసులంటే భయాన్ని వీడాలని, ప్రజలకు సేవ చేసేందుకు పోలీసు వ్యవస్థ ఎల్లవేళలా సిద్ధంగా ఉంటుందన్నారు. ఎలాంటి సమస్య తలెత్తినా పోలీసుల దృష్టికి తెస్తే, తమ శాఖ పరిధిలోని సమస్యను పరిష్కరించడంతోపాటు మిగతా శాఖల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా గిరిజన యువతకు వాలీబాల్‌ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ లక్ష్మయ్య, పోలీసు సిబ్బంది, గాజులబంద, బల్లుగూడ గ్రామస్తులు పాల్గొన్నారు.