ప్రజాశక్తి-రంపచోడవరం
ఏజెన్సీ ప్రాంత సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం అన్నారు. మంగళవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో 6 మండలాల ముఖ్య కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు మట్ల వాణిశ్రీ అధ్యక్షతన జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న సీతారాం మాట్లాడుతూ రంపచోడవరం ఏజెన్సీ 11 మండలాల్లో గిరిజనులు రహదారులు, తాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్, ఇతర సమస్యలతో సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల పంటలకు గిట్టుబాటు ధర లేదని, ప్రధానంగా జీడిమామిడి, జాబ్రా పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. గిరిజనులు పండించిన, సేకరించిన అటవీ ఉత్పత్తులను ఐటిడిఎ, జిసిసి ద్వారా కొనుగోలు చేసి గిరిజనులను దళారుల బారినుండి కాపాడాలన్నారు. ప్రభుత్వం సచివాలయాల నిర్మాణాల పేరుతో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, గిరిజన గ్రామాల్లో ఎటువంటి కనీస మౌలిక సదుపాయాలు లేకుండా చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కనీస సౌకర్యాలు, వైద్యులు, మందులు అందుబాటులో ఉంచాలని, ఓపికి తగినట్లు బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ కాలేజీలు, ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో ఎఎన్‌ఎంలను నియమించాలన్నారు. ఇక్కడ నుంచి గెలిసిన అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. పోలవరం నిర్వాసితులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గిరిజనులు, ఏజెన్సీ ప్రాంత సమస్యలను పట్టించుకోకపోతే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలను కదిలించి ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి బొప్పెన కిరణ్, నాయకులు కె.శాంతిరాజు, బాపన్నదొర, శ్రీను, సిరిమల్లిరెడ్డి, పాపారావు, రాజన్నదొర, రఘుపతి, బులియమ్మ, తదితరులు పాల్గొన్నారు.










