Aug 13,2023 21:23

పుస్తకాశిష్కరణ సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ రఘువర్మ

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : తన ప్రతి రచనలోనూ సమాజంలో మార్పు కోసం ప్రయత్నిస్తూ వ్యక్తుల మెరుగైన జీవితాల కోసం భూషణం కలలుగన్నారని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ అన్నారు. ఆదివారం స్థానిక గిరిజన సమావేశ మందిరంలో స్నేహకళా సాహితి, ఎపిటిఎఫ్‌ సంయుక్తంగా నిర్వహించిన భూషణం కథలు పరిచయ సభలో ఆయన ప్రసంగించారు. ఎఎస్‌ విద్యాసాగర్‌ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో తొలుత ప్రముఖ సాహితీవేత్త గంటేడ గౌరునాయుడు మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులన్నీ భూషణం కథల్లో ప్రతిబింబిస్తాయన్నారు. భూషణం వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఈ ప్రాంత రచయితలు బాధ్యతాయుతంగా రచనలు చేయాలన్నారు. ఉపాధ్యాయ పత్రిక సంపాదకుని గానూ, ఎపిటిఎఫ్‌. నాయకునిగానూ భూషణం అందించిన సేవలు చిరస్మరణీయమైనవని ఎపిటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు పిఎస్‌. ప్రకాశరావు అన్నారు. జిఎస్‌ చలం సంపాదకులుగా వ్యవహరించిన భూషణం కథల పుస్తకాన్ని ప్రముఖ కథారచయిత రౌతు బంగారునాయుడు (సువర్ణముఖి) పరిచయం చేశారు. సమావేశంలో ఎపిటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు కొప్పుల భానుమూర్తి, మల్లిపురం జగదీశ్‌ అతిథులుగా హాజరైన ఈ సమావేశంలో భూషణం కుమారులు సోమశేఖర్‌, కల్యాణ్‌, కోడలు పద్మావతి హాజరయ్యారు. వీరికితో పాటు ఉత్తరాంధ్రకు చెందిన సాహితీవేత్తలు ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక వ్యవస్థాపకులు కెఎన్‌్‌ మల్లీశ్వరి, దాసరి రామచంద్రరావు, బంకురు జోగినాయుడు, పక్కి రవీంద్రనాథ్‌, నల్లా బాలకృష్ణ, చందనపల్లి గోపాలరావు, సిరికి స్వామినాయుడు, గడగమ్మ రామకష్ణ, కాకిముక్కల నాగు, పల్ల రోహిణీ కుమార్‌, కె.కె వర్మ, కె.శ్రీనివాస్‌ సిహెచ్‌ పారినాయుడు, గంటేడ సోమేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.