Jun 27,2023 00:40

మెడికల్‌ కళాశాల నమూనాలను పరిశీలిస్తున్న మంత్రి రజని

ప్రజాశక్తి-పాడేరు:రాష్ట్రంలో ఎంపిక చేసిన సీతంపేట, పార్వతీపురం, పాడేరు, రంపచోడవరం, బుట్టాయిగూడెం గిరిజన ప్రాంతాల గిరిజనుల కోసం రూ. 246 కోట్లతో గిరిజన మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల ఏర్పాటు చర్యలు తీసుకున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖామాత్యులు విడదల రజని వెల్లడించారు. స్థానిక తలారిసింగి గిరిజన సంక్షేమ పాటశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సికిల్‌సెల్‌ అనీమియా పరీక్షలను సోమవారం మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో సుమారు 20 లక్షల మంది సికిల్‌సెల్‌ అనీమియాతో భాద పడుతున్నట్లు గుర్తించామని, మొదటి దశలో 6.50 లక్షల మందికి పరీక్షలు నిర్వహించి తగు చికిత్సలు అందించడం జరుగుతుందన్నారు. 40 సంవత్సరాల వయసు లోపు ఉన్న వారికి రాష్ట్ర వ్యాప్తంగా పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ముఖ్యంగా పాఠశాలల చిన్నారులు, గర్భిణీలు, బాలింతలపై ప్రత్యెక దృష్టి సారించామన్నారు. సికిల్‌సెల్‌ అనీమియతో భాద పడేవారికి నెలకు పది వేల రూపాయలు ఫించను అందిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసారు. ముఖ్యమంత్రి గిరిజనులపై ఉన్న ప్రేమతో ఎంత డబ్బు ఖర్చైనా వెనుకాడకుండా మెరుగైన వైద్యం అందించడానికి మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు.
జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ మాట్లాడుతూ, గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రభుత్వం ప్రత్యెక దృష్టి సారించడం గొప్ప విషయమని అన్నారు. జిల్లాలో 67 మంది వైద్యులు, ఫ్యామిలి ఫిజీషియన్‌ కింద మరో 22 మంది వైద్యులు సేవలు అందిస్తున్నారని వివరించారు.
ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, జిల్లాలో సికిల్‌సెల్‌తో భాదపడే విద్యార్ధులు ఐదు వందల పైగా ఉన్నారని, పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. పాజిటివ్‌ వచ్చిన వారికి కార్డులు అందచేస్తారని, తద్వారా భాగస్వామిని నిర్ణయించటంలో తోడ్పాటు లభిస్తుందని వివరించారు. ముఖ్యమంత్రి వైద్యానికి పెద్ద పీట వేసారని, గిరిజన ప్రాంతాలలో కూడా 24 గంటల వైద్య సదుపాయాలు అందుతున్నాయని వివరించారు. రూ. 500 కోట్లతో మెడికల్‌ కళాశాల నిర్మిస్తున్నారని తెలిపారు.
అరకు ఎంపి జి.మాధవి, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్‌ జె.సుభద్ర, అరకు శాసన సభ్యులు చెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ, సికిల్‌సెల్‌ అనీమియా వ్యాధి వ్యాధి నియంత్రణ, పరీక్షలపై వివరించారు. భవిష్యత్తులో ఎవరికీ ఈ వ్యాధి రాకూడదని ఆకాంక్షించారు.
వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి ఎం.టి. కృష్ణబాబు మాట్లాడుతూ, 40 ఏళ్ల లోపు వయసు ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు.పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి వివిధ కేటగిరీలకు సికిల్‌సెల్‌ అనీమియా పరీక్షల నిర్వహణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లను ప్రారంభించి తనిఖీలను పరిశీలించారు. రక్తదాన శిభిరాన్ని ప్రారంభించి రక్తదాతలను అభినందించారఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య విధాన పరిషత్‌ కమిషనర్‌ . ఎస్‌. వెంకటేశ్వర్లు, జిసిసి, ట్రైకార్‌ చైర్పర్సన్లు శోభా స్వాతి రాణి, ఎస్‌.బుల్లిబాబు, వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు వి.రామిరెడ్డి, సంయుక్త కలక్టర్‌ జె.శివ శ్రీనివాసు, ఐటిడిఎ ప్రాజెక్ట్‌ అధికారులు వి.అభిషేక్‌, సూరజ్‌ గనోరే, మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యులు టి. నరసింగ రావు, తదితరులు పాల్గొన్నారు.
వచ్చే ఏడాది నుండే మెడికల్‌ కళాశాల తరగతులు
వచ్చే విద్యా సంవత్సరం నుండే మెడికల్‌ కళాశాల తరగతులు ప్రారంభించటానికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి రజని స్పష్టం చేసారు. పాడేరులో నిర్మిస్తున్న మెడికల్‌ కళాశాల ప్రగతిని పరిశీలించి తగు సూచనలు జారీ చేసారు.
ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడుడూ, గతంలో వైద్య సేవలకు విశాఖపట్నం వెళ్ళవలసి వచ్చేదని, ప్రస్తుతం ఆ పరిస్థితులు లేవని మంత్రి తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఐదు జిల్లాలలో కొత్తగా తరగతులు ప్రారంభించే దిశగా చర్యలు తీసుకున్నారని వివరించారు. ఇటీవల ముఖ్యమంత్రి 49 వేల పైగా ఖాళీలు భర్తీ చేసారని గుర్తు చేసారు.
మోదకొండమ్మను సన్నిధిలో రజిని
పాడేరులో మోదకొందమ్మ అమ్మవారిని మంత్రి విడదల రజని సోమవారం దర్శించుకున్నారు. మంత్రికి పలవురు
స్వాగతం పలికారు. ప్రత్యెక పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు అందించారు.
శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌ ప్రారంభం
పాడేరు: వైద్యరంగంలో స్త్రీ వైద్య నిపుణులు (గైనకాలజిస్ట్‌)గా 20 ఏళ్ల అపార అనుభవమున్న ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌ మెంబర్‌, ఈ ప్రాంత వాసి డాక్టర్‌ తమర్భ నర్సింగరావు పాడేరులో నూతనంగా నెలకొల్పిన శ్రీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి విడుదల రజిని సోమవారం ప్రారంభోత్సవం చేశారు. పురోహితుల వేదమంత్రాలు మధ్య రిబ్బన్‌ కత్తిరించి హాస్పటల్‌ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పటల్లో ఏర్పాటు చేసిన ఆధునిక వైద్య పరికరాలను పరిశీలించారు. వైద్య సేవలపై ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యులు డాక్టర్‌ తమర్బ నర్సింగరావును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్‌ సభ్యులు గొడ్డేటి మాధవి , అరకు ఎమ్మెల్యే శ్రీ చెట్టి పాల్గుణ , జిల్లా పరిషత్‌ చైర్పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.