Nov 14,2021 12:39

వాస్తవిక సంఘటనలను ఉన్నదున్నట్లు తెరపై చూపడం చాలా కష్టం. ముఖ్యంగా స్టార్‌ హీరోలకు కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అడ్డం వచ్చేస్తుంటాయి. కానీ ఓటీటీ వచ్చాక సినిమాని చూసే తీరు మారింది. బ్రిలియెంట్‌ రైటింగ్‌తో మామూలు కథలూ కమర్షియల్‌ స్థాయిలో చెప్తున్నారు. అలా ధైర్యం చేస్తున్న హీరోల్లో సూర్య ఒకరు. తమిళంతో పాటు, తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న నటుడు. తాజాగా ఓ కోర్ట్‌ రూమ్‌ డ్రామాతో నిర్మాతగానూ మన ముందుకు వచ్చారు. 1995లో మారుమూల అడవుల్లో ఉండే అణగారిన వర్గాలకి చెందిన కొందరిని పోలీసులు అన్యాయంగా ఓ కేసులో ఇరికించారు. ఆ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రమే 'జై భీమ్‌'. అసలు కథేంటి? సూర్య ఎలా నటించారు? వంటి విషయాలు తెలుసుకుందాం..!

చిత్రం: జై భీమ్‌
నటీనటులు: సూర్య, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌, రాజిష విజయన్‌, లిజోమోల్‌ జోసీ, మణికంఠన్‌ తదితరులు
సంగీతం: షాన్‌ రొనాల్డ్‌
ఎడిటింగ్‌: ఫిలోమిన్‌ రాజ్‌
సినిమాటోగ్రఫీ: ఎస్‌.ఆర్‌.కాదిర్‌
నిర్మాతలు: సూర్య, జ్యోతిక
రచన, దర్శకత్వం: టి.జె.జ్ఞానవేల్‌
ఓటీటీ : అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
విడుదల తేదీ : 2 నవంబర్‌, 2021

కథలోకి వెళ్తే... రాజన్న (మణికందన్‌) గిరిజనుడు. నిజాయతీపరుడు. కష్టపడి పనిచేస్తాడు. తన భార్య సినతల్లి (లిజో మోల్‌ జోసే) తో కలిసి ఊరి బయట నివసిస్తుంటాడు. అతనికి ఐదేళ్ల పాప ఉంటుంది. సినతల్లి గర్భవతిగా ఉంటుంది. అలాగే అతనితో పాటు మరికొంత మంది గిరిజనులూ ఊరి బయటే ఉంటారు. అయితే వారికి తమదంటూ ఓ స్థలం కానీ, గుర్తింపు కానీ ఉండదు. దీనికి తోడు వారిని ఊర్లోకి రానివ్వరు ఊరి పెద్దలు. అయినా అవేవీ పట్టించుకోకుండా కష్టపడి, కూలీ నాలీ చేసుకుని బతుకుతుంటారు. చేలలో ఎలుకలు, పాములను పట్టుకుంటూ జీవనం సాగిస్తుంటారు. ఓసారి స్థానిక రాజకీయ నాయకుడి ఇంట్లోకి పాము రావడంతో రాజన్నకు కబురుపెడతారు. దీంతో అతను పామును పట్టుకుంటాడు. ఆ మరుసటి రోజు రాజన్న వేరే ఊర్లో ఇటుకల బట్టీలోకి పనికి వెళ్లిపోతాడు. రాజన్న ఊర్లో లేని రోజున అదే ఇంట్లో చోరీ జరుగుతుంది. పామును పట్టే సందర్భంలో అన్నీ గమనించిన రాజన్ననే ఆ దొంగతనం చేశాడని పోలీసులు అతడిపై కేసు బనాయిస్తారు. రాజన్న ఊర్లో ఉండకపోవడంతో అతనికి సంబంధించిన వారిని పోలీసులు లాకప్‌లో వేసి, చిత్ర హింసలు పెడతారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తారు. ఇంతలో ఊర్లోకి వచ్చిన రాజన్ననీ అరెస్ట్‌ చేస్తారు. నేరం ఒప్పుకోమని తీవ్రంగా హింసిస్తారు. ఆ మరుసటి రోజు రాజన్న మరో ఇద్దరితో కలిసి పారిపోయాడని చెబుతూ పోలీసులు వెతకడం మొదలుపెడతారు. ఎంత వెతికినా ఆ ముగ్గురూ కనిపించరు. రాజన్న జైలు నుంచి తప్పించుకున్నాడని అతడి భార్య సినతల్లికి చెబుతారు. దీంతో తన భర్త ఏమయ్యాడో తెలియక ఆమె బాధపడుతుంటుంది. కోర్టులో కేసు వేస్తే పోలీసులే అతడిని వెతికి తీసుకొచ్చి ఇస్తారని, అందుకు అడ్వకేట్‌ చంద్రు (సూర్య) సాయం చేస్తాడని వారికి చదువు చెప్పే టీచర్‌ మిత్ర (రజిషా విజయన్‌) చెబుతుంది. దీంతో సినతల్లి లాయర్‌ చంద్రును ఆశ్రయించి తన బాధలన్నింటినీ చెప్పుకుంటుంది. దీంతో కేసు వాదించటానికి ముందుకొస్తాడు చంద్రు. కేసు టేకప్‌ చేసిన చంద్రుకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? వాటిని అధిగమించడానికి ఏం చేశాడు? తప్పించుకున్న రాజన్న, తోటి ఖైదీలు ఏమయ్యారు? అనే విషయాలను తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
     మూడు దశాబ్దాల క్రితం పోలీసులు కొన్ని కులాలకి చెందిన నిరుపేద గిరిజన ప్రజలని ఎలా టార్గెట్‌ చేసి, హింసించే వారనేది ఈ కథలోని మెయిన్‌ పాయింట్‌. కులవివక్ష ఎప్పుడో వందలేళ్ల క్రితం ఉండేది తప్ప మేం పుట్టాక ఎప్పుడూ చూడలేదు అని చెప్పే కొందరికి కనువిప్పు కలిగించే చిత్రం. ఎలుకల్ని, పాముల్ని పట్టుకుంటూ పొలాల్లో కూలి పనిచేసే జనానికి అక్షరజ్ఞానం అందకుండా, కనీసం ఓటు హక్కు కూడా కల్పించకుండా, ఎక్కడ ఏ నేరం జరిగినా నేరస్థుడు దొరకనప్పుడు వీరిలో ఒకరిని ఇరికించి, జైల్లోకి తోసేసే ఆటవిక పర్వం దేశంలో చాలా చోట్ల జరిగింది. అలాగే తమిళనాడులో కూడా ఒకానొక ప్రాంతంలో జరిగింది. సినిమా చివర్లో ఆ వివరాలు పొందుపరిచారు. ఆ కథే ఈ 'జై భీమ్‌'.
      లాయర్‌ చంద్రు పాత్రలో సూర్య ఎప్పటి మాదిరే అద్భుతంగా నటించాడు. కోర్టు సీన్స్‌లో ఆయన పలికించిన హావభావాలు మనసును తాకుతాయి. ఇక గిరిజన దంపతులుగా మణికందన్‌, లిజో మోల్‌ జోసేలు అద్భుత నటనను కనబరిచారు. ముఖ్యంగా సినతల్లిగా నటించిన లిజోమోల్‌ జోస్‌ గురించి చెప్పాలి. సమాజంలోని దాష్టీకాన్ని ఎదిరించే దళిత మహిళగా ఆమె నటన అభినందనీయం. డీజీపీ దగ్గర ఆమె చెప్పే డైలాగ్స్‌ అద్భుతంగా ఉంటాయి. సిన్సియర్‌ పోలీస్‌గా ప్రకాష్‌రాజ్‌, పంతులమ్మగా రజిషా విజయన్‌, రావు రమేశ్‌ తమదైన నటనతో మెప్పించారు. దర్శకుడు జ్ఞానవేల్‌ నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని, తెరకెక్కించిన సన్నివేశాలు హృద్యంగా అనిపిస్తాయి. షాన్‌ రొనాల్డ్‌ సంగీతం చాలా బాగుంది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకి ప్రాణం పోశాడు. ఎస్‌ఆర్‌ కాదిర్‌ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్లస్‌. కోర్టు సన్నివేశాలను తెరపై అద్భుతంగా చూపించాడు. ఫిలోమిన్‌ రాజ్‌ ఎడిటింగ్‌ ఫర్వాలేదు. నటుడిగా, నిర్మాతగా సూర్య చేసిన ప్రయత్నానికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే.