ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లా ముంచంగిపుట్టు మండలం మారుమూల ప్రాంతమైన ఓ చిన్న కుగ్రామంలో సామాజిక ఆరోగ్య కార్యకర్తగా పని చేస్తున్న ఓ గిరిజన కార్మికురాలు తన గ్రామానికి సొంత సొమ్ము రూ.3 లక్షలతో రోడ్డు నిర్మించి తన ఉదారతను చాటుకున్నారు. జోలపుట్టు పంచాయతీ కేంద్రానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడ్డుపుట్టు ఓ పాతిక కుటుంబాలు నివసిస్తున్న చిన్న కుగ్రామమిది. ఈ గ్రామానికి కోడలిగా వచ్చిన బురిడి జమ్మ తన స్వస్థలమైన డుంబ్రిగూడ మండలం చిన్న అంజొడ గ్రామం నుంచి కొన్నేళ్ల కిందట వచ్చి భర్తతో స్థిరపడింది. ఇంటర్ వరకు చదువుకున్న ఆమె ఈ గ్రామంలో సామాజిక ఆరోగ్య కార్యకర్తగా విధుల్లో చేరింది. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేక గ్రామస్తులు అనేక అవస్థలు పడుతున్నారు ముఖ్యంగా ఆసుపత్రికి వెళ్లాలన్న, పిల్లల్ని జోలపుట్ పంచాయతీ కేంద్రంలోని పాఠశాలకు పంపించాలన్నా కష్టతరంగా ఉండేది. గర్భిణీలను రోగులను తానే స్వయంగా దగ్గరుండి డోలి మోతలతో ఆసుపత్రులకు తీసుకువెళ్లిన అనుభవాన్ని, గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఆ కష్టాన్ని, దగ్గరుండి చూసిన ఆమె ఎంతో చలించి పోయింది. దీంతో చాలా మంది గ్రామస్తులు ఊరి విడిచి మరోచోట జీవనానికి వెళ్లే పరిస్థితులు కూడా ఆమె గమనించింది. రోడ్డు లేకపోవడంతో ఊరి ప్రజలు ఎదుర్కొంటున్న అవస్థల్ని ఆమె కళ్ళారా చూడడంతో గ్రామానికి ఎలాగైనా రోడ్డు నిర్మించాలని భావించింది. దీంతో ఆమె తన కుటుంబానికి ఇల్లు నిర్మించడం కోసం తాను దాచుకున్న రెండున్నర లక్షల రూపాయలు వెచ్చించి రోడ్డు నిర్మాణం ప్రారంభించింది. మరో ఇద్దరు దాతలు ఆమెకు 50 వేల రూపాయల సాయం అందించారు. దీంతో మూడు లక్షలతో సుమారు రెండున్నర కిలోమీటర్ల రోడ్డును నిర్మించింది. దీంతో ఆ గ్రామానికి ఆటోలు, బైకులు తిరిగే పరిస్థితి ఏర్పడింది. కొంత మేర రవాణా సమస్యకు పరిష్కారం ఏర్పడింది. ఆమెకు నెలకు కేవలం నాలుగు వేల రూపాయలు వేతనం మాత్రమే వస్తున్నా, పేదరికంలో కూడా గ్రామ ప్రజల కష్టాన్ని గుర్తించి ఊరి కోసం రోడ్డు నిర్మించి తన ఔదార్యాన్ని చాటుకుంది. ఈ సామాజిక ఆరోగ్య కార్యకర్తలు సహచర కార్యకర్తలందరూ ఎంతో అభినందిస్తున్నారు.
సిఐటియు నాయకులు ఉమామహేశ్వరరావుతో పాటు సామాజిక ఆరోగ్య కార్యకర్తల సంఘం నాయకులు ఇటీవల ఆమెను సన్మానించి అభినందనలు తెలిపారు. రోడ్డు లేక తమ గ్రామస్తులు ఎదుర్కొంటున్న అవస్థల్ని అధికారులు గుర్తించాలని అసంపూర్తిగా ఉండిపోయిన మరో రెండు కిలోమీటర్ల రోడ్డును పూర్తి చేయాలని బురిడీ జమ్మ ఈ సందర్భంగా అధికారులను వేడుకుంటున్నారు.










