Jul 21,2023 21:38

గిరిజన సంఘం జిల్లా మహాసభలో మాట్లాడుతున్న డాక్టర్‌ మిడియం బాబూ
  అమరుల స్థూపం వద్ద నివాళ్లు అర్పిస్తున్న గిరిజన సంఘం నాయకులు
 అమరుల స్థూపం వద్ద నివాళ్లు అర్పిస్తున్న గిరిజన సంఘం నాయకులు

ప్రజాశక్తి కురుపాం / గుమ్మలక్ష్మీపురం :  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నూతన చట్టాలను తీసుకొచ్చి ఆదివాసీ గిరిజన జీవన విధానంపై తీవ్రంగా దాడి చేస్తోందని ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్‌ జాతీయ చైర్మన్‌ మిడియం బాబూరావు అన్నారు. కురుపాంలో జరుగుతున్న ఎపి గిరిజన సంఘం ఏడో జిల్లా మహాసభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేట్‌ కంపెనీలకు ఇష్టారాజ్యంగా అనుమతులిస్తూ తరతరాల నుంచి అడవినే నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఆదివాసీ గిరిజనులను బాక్సైట్‌ తవ్వకాల పేరుతో దూరం చేస్తున్నారని అన్నారు. గిరిజనులకు వెన్నుముకగా ఉన్న జిఒ 3ను రద్దు చేసి ఉద్యోగ అవకాశాలు లేకుండా చేసిందన్నారు. 1/70 చట్టం పకడ్బందీగా అమలు చేయడం లేదన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం ఏర్పడ్డ ఐటిడిఎ, జిసిసి సంస్థలకు నిధుల్లేక అభివృద్ధి కుంటుపడిందన్నారు. అటవీ హక్కు, పీసా, ఉపాధిహామీ చట్టాలను ఎత్తివేసేందుకు చర్యలు సిద్ధం చేస్తుందన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటుపరం చేసేందుకు మోడీ సర్కార్‌ ప్రయత్నాలు సాగిస్తోందన్నారు. ఇదే జరిగితే ఇందులో పనిచేస్తున్న 1500 మంది గిరిజన ఉద్యోగులు ఉద్యోగ భద్రత కోల్పోతారని అన్నారు. బిజెపి ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలకు రాష్ట్రంలో వైసిపి కూడా వంత పాడుతూ కొనసాగిస్తుందని అన్నారు. ఇందులో భాగంగానే బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి సిద్ధపడిందన్నారు. సవర భాష వాలంటీర్లు తొలగించి విద్యాబోధనకు దూరం చేసిందన్నారు. బిజెపి భావజాలానికి వ్యతిరేకంగా గిరిజన సంఘం ఆధ్వర్యంలో గిరిజనులను చైతన్యవంతం చేయాలని కోరారు. గ్రామ గ్రామాన ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి హక్కులు, చట్టాలు రక్షణ పొందడానికి ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
అనంతరం ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న వ్యతిరేక విధానాలతో గిరిజనుల మనుగడకు ముప్పు వాటిల్లుతుందన్నారు. తరతరాల నుంచి పోడు వ్యవసాయం చేస్తున్న భూమిపై హక్కు కల్పించేందుకు సాగుకు పట్టాలివ్వడం లేదన్నారు. గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలను ఎత్తివేసి ప్రభుత్వ విద్యకు గిరిజనులను దూరం చేస్తున్నారని విమర్శించారు. అనంతరం గిరిజన సంఘం ఆధ్వర్యంలో భవిష్యత్‌ ఉద్యమాలకు కార్యచరణ రూపొందించారు.
గిరిజన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులుగా లక్ష్మణరావు, అవినాష్‌
మహాసభల అనంతరం జిల్లా నూతన కమిటీ ఎన్నిక జరిగింది. జిల్లా గౌరవ అధ్యక్షులుగా ఎస్‌.అప్పారావు, అధ్యక్షులుగా ఎం.లక్ష్మణరావు, ఉపాధ్యక్షులుగా ఎం.శ్రీనివాసరావు, సీతారాం, కె.రామస్వామి, ఎన్‌.శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి కోలక అవినాష్‌, సహాయ కార్యదర్శులుగా పి.తిరుపతిరావు, బి.వెంకటరావు, కోశాధికారిగా ఎం రమణ ఎన్నికయ్యారు.