Nov 25,2022 23:54

గిరిజన సంఘం మండల మహాసభలో మాట్లాడుతున్న లోతా రామారావు

గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు
ప్రజాశక్తి-రాజవొమ్మంగి

ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల హక్కులు, చట్టాలను పట్టిష్ట అమలు చేసేందుకు ఆదివాసీలంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక ఆర్‌ అండ్‌ బి అతిథి గృహం వద్ద గిరిజన సంఘం మండల 5వ మహాసభ సంఘం నాయకులు కాళ్ల రాజబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏజెన్సీలో ఉన్న వనరులను కార్పొరేట్‌ శక్తులకు దోచిపెట్టెందుకు గిరిజనుల హక్కులు, చట్టాలను తుంగలో తొక్కుతున్నాయని విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఉద్యోగాల్లో గిరిజనులకు 100శాతం రిజర్వేషన్‌ కల్పించే జీవో నెంబర్‌ 3ని తక్షణం పునరుద్ధించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు శామ్యూల్‌ కమిటీని ఏర్పాటు చేసిందని, తక్షణమే ఇందుకు సంబంధించిన జిఒ 52ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. అభివృద్ధి చెందిన బోయ వాల్మీకులు రాష్ట్రంలో 40 లక్షలు మంది, బెంతు ఒరియాలు 15 లక్షలు మంది ఉన్నారని వీరిని ఎస్‌టి జాబితాలో కలపడం వల్ల గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని తెలిపారు. జీవో 52ను రద్దు చేయకుంటే ఆదివాసీ ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు.
గిరిజన సంఘం మండల కమిటీ ఎన్నిక
అనంతరం గిరిజన సంఘం మండల నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్ష, కార్యదర్శులుగా కుంజం జగన్నాథం, కొండ్ల సూరిబాబు, ఉపాధ్యక్షులుగా పాండవుల సత్యనారాయణ, జర్త లక్ష్మి, సహాయ కార్యదర్శులుగా జర్త రాజుబాబు, ట్రెజరర్‌గా గూడెం మల్లికార్జునరావు, మరో ఎనిమిది మంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు టి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.