Jul 08,2023 21:37

మాట్లాడుతున్న గిరిజన సంఘం నాయకులు

ప్రజాశక్తి-పాచిపెంట : గిరిజన హక్కులు, చట్టాలను పాలకులు కాలరాస్తున్నారని గిరిజన సంఘం జిల్లా నాయకులు గెమ్మెల జానకిరావు ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం పాచిపెంటలో గిరిజన సంఘం మండల మండల మహాసభను నాయకులు సుకురు అప్పలస్వామి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం... వారికి ద్రోహం చేస్తూ బోయ, వాల్మీకులను ఎస్‌టి జాబితాలో చేర్చాలని చూస్తోందని విమర్శించారు. మరోవైపు నేటికీ గిరిజనులకు రహదారి సౌకర్యాలు లేవన్నారు. కనీస సౌకర్యాలు కల్పించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అదే సందర్భంగా కార్పొరేట్‌ కంపెనీల కోసం గ్రీన్‌ఫీల్డ్‌ రోడ్డును ఆగమేఘాలపై నిర్మిస్తున్నారని మండిపడ్డారు. కుడుమూరు భూములను సాగుచేస్తున్న గిరిజన రైతులకు పట్టాలు మంజూరు చేయాలని, కొండతాడూరు భూములకు హక్కులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఫారెస్ట్‌ క్లియరెన్స్‌ ఇచ్చి రహదారి నిర్మాణం చేపట్టాలన్నారు. గిరిజన సంఘం జిల్లా కమిటీ సభ్యులు మంచాల శ్రీనివాసరావు మాట్లాడుతూ గిరిజన హక్కుల పరిరక్షణ కోసం ఐక్యపోరాటాలకు సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం 9 మందితో నూతన కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షులుగా గెమ్మెల బాబూరావు, కార్యదర్శిగా జన్ని రామయ్య ఎన్నికయ్యారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి మర్రి శ్రీనివాసరావు, సిఐటియు నాయకులు కోరాడ ఈశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.