ఎస్‌టి కమిషన్ ఛైర్మన్ కె.రవిబాబు
ప్రజాశక్తి - నూజివీడు రూరల్
గిరిజన హక్కులకు రక్షణగా ఉంటామని ఎస్‌టి కమిషన్ ఛైర్మన్ డాక్టర్ కె.రవిబాబు హెచ్చరించారు. శుక్రవారం మండలంలోని ఓగిరాల తండాలో ఎస్‌టి కమిషన్ ఏడు తండాల గిరిజనులతో, ప్రజలతో ముఖాముఖి నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అధికార పార్టీ యంత్రాంగం గిరిజనులకు చేరేలా చర్యలు తీసుకోవడంలో పూర్తిఅలసత్వం వహిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఈ నాలుగేళ్ల కాలంలో గిరిజన అభివృద్ధికి ఎన్నో చట్టాలు తీసుకొచ్చిందన్నారు. విద్య, ఉద్యోగం, వైద్యం, ఆర్థిక, అంశాలలో గిరిజనుల అభివృద్ధే ధ్యేయంగా పెట్టుకుందన్నారు. రాష్ట్రంలో నూజివీడు మండలంతో పాటు పలుచోట్ల రెవెన్యూ, అటవీశాఖ అధికారులు సమన్వయ లోపంతో గిరిజనులకు అన్యాయం జరుగుతుందన్నారు. గిరిజనులు సాగు చేసుకునే భూమి వారికే చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సబ్‌కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, భోగిరాల తండా సర్పంచ్ బూక్యా రాణి, ఎంపిటిసి దుర్గమ్మ, అధికారులు పాల్గొన్నారు.
నూజివీడు:నూజివీడు నియోజకవర్గంలో ఎపి గిరిజన సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కె.రవిబాబు శుక్రవారం పర్యటించారు. నూజివీడు ప్రాంతంలోని తండాలలో ఉన్న గిరిజనుల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాజ్యాంగపరంగా ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు. అటవీ భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులకు అటవీశాఖ అధికారులు భూమి నుండి తొలగించి వాటిని స్వాధీనం చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులకు న్యాయం జరిగేలా చూస్తానని చెప్పారు. గిరిజన సమస్యలు తెలుసుకునేందుకు వస్తే జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఎవరూ రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం సోషల్ వెల్ఫేర్, ఎపి ట్రాన్స్‌కో, ఎడ్యుకేషన్, ట్రైబల్ వెల్ఫేర్, ఆర్‌డబ్ల్యూఎస్, హౌసింగ్ డిపార్ట్‌మెంట్ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలంటూ కలెక్టర్ ప్రసన్నవెంకటేష్‌ను కోరారు.
పట్టణంలోని శ్రీనివాస మహల్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద రవిబాబు అన్నదానం చేశారు. ఉదయగిరి ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ ఛైర్మన్ ఉదయగిరి కృపారావు నిరంతరాయంగా కొనసాగిస్తున్న అన్నదానాన్ని రవిబాబు అభినందించారు. స్వయంగా పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృపారావు సేవా దృక్పథం ఎంతో గొప్పదన్నారు.










