May 18,2023 23:54

ర్యాలీ చేపడుతున్న గిరిజన సంఘం నేత సురేంద్ర, నాయకులు

ప్రజాశక్తి-పాడేరు:గిరిజన హక్కులు, చట్టాల పరిరక్షణకు గిరిజనుల్ని సంఘటితం చేసి ఉద్యమాల్ని ఉధృతం చేస్తామని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిలో సురేంద్ర తెలిపారు. గిరిజన సంఘం అల్లూరి జిల్లా 8వ మహాసభలు పాడేరు జిల్లా కేంద్రంలో గురువారం విజయవంతంగా జరిగాయి. ఈ మహాసభలో గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సురేంద్ర మాట్లాడుతూ, గిరిజన హక్కులు, చట్టాలు పటిష్టంగా అమలుకై గిరిజన సంఘం నిర్వహించే పోరాటాలను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. 1/70 చట్టం, అటవీ హక్కుల చట్టం, పీసా చట్టం అమలు చేయాలని, హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ రద్దు చేయాలని, గిరిజన సంస్కతి కాపాడాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యుడు పి. అప్పలనరస మాట్లాడుతూ, జూన్‌ 8, 9 తేదీల్లో గిరిజన సంఘం రాష్ట్ర మహాసభలు అరకువేలిలో జరగనున్నాయని, ఈ మహాసభలో రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చిస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనులపై చేస్తున్న దాడికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని గిరిజన సంఘం నిర్మిస్తుందన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బోయ/వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్పిస్తూ ఎపి అసెంబ్లీలో చేసిన తీర్మానం రద్దు చేయాలని, అటవీపాలసీ విధానం రద్దు చేసి, జీవో 3రే చట్టబద్ధం కల్పించాలన్నారు. గిరిజన మాతృ భాష విద్య వాలం టీర్లను రెగ్యులర్‌ చేసి, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం అధ్యక్షుడు లక్కు, జిల్లా నాయకులు నరసయ్య, ఎంఎం శ్రీను, టి.సూర్యనారాయణ, కుమారి, కొండలరావు, కృష్ణారావు, సర్బు నాయుడు, ఎల్‌.సుందరరావు, నారాయణ, చిట్టిబాబు పాల్గొన్నారు.