ప్రజాశక్తి - గుమ్మలక్ష్మీపురం: రాయగడ జమ్ము పంచాయతీలోని పెంగవలో గురువారం జట్టు తోట జీవ, పశుసంవర్ధక శాఖ ఉమ్మడిగా పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పి. లక్ష్మణరావు మాట్లాడుతూ వర్షాకాలంలో పరిసరాల అపరిశుభ్రత, వరద నీళ్లు, పచ్చిక గడ్డి పైన ఉండే కీటకాలతో కూడిన మేత తినడం వల్ల గేదెలు, మేకలు, గొర్రెలకు, పశువులకు వివిధ రకాల వ్యాధులు సోకి అనారోగ్యాలకు గురవుతా యన్నారు. దీంతో వ్యాధి నిరోధక శక్తి తగ్గి అంటు వ్యాధుల బారిన త్వరగా పడతాయని, చివరకు మూగజీవులు ప్రాణాలు కోల్పోతాయని తెలిపారు. వ్యాధులు, సీజనల్ వ్యాధుల విషయంలోనూ ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరిం చాలన్నారు. గొర్రెలకు, మేకలకు మూతి ఫుల్లు వ్యాధులకు టీకాలు వేశారు. చిటుకు వ్యాధికి టీకాలు వేశారు. ఆవులకు, ఎద్దులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జీవ కో-ఆర్డినేటర్ జి.ప్రోబోద్, జి.మురళీమోహన్, వెటర్నరీ సహాయకులు నవీన్, పి.నవీన్, టి.రామారావు, రైతులు, పాల్గొన్నారు.
వైద్య శిబిరాలు నిర్వహించాలి
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని మారుమూల గిరిజన ప్రాంతాల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వైద్య శిబిరాలు నిర్వహించాలని టిడిపి సీనియర్ నాయకులు బిడ్డిక పద్మావతి కోరారు. గ్రామాల్లో ఎక్కడ చూసినా మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరాలతో గిరిజనుల ఎక్కువగా బాధపడుతున్నారని తెలిపారు. స్థానికంగా వైద్య శిబిరాలు నిర్వహించి మందులు పంపిణీ చేయాలని కోరారు.
వెంకంపేటలో ఫ్యామిలీ డాక్టర్ వైద్య శిబిరం
పార్వతీపురంరూరల్: మండలంలోని వెంకంపేటలో గురువారం ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా డాక్టర్ శ్రీకాంత్ వైద్య పరీక్షలు అందించారు. ఈ సందర్భంగా గ్రామంలో 48 మందికి వైద్య పరీక్షలు అందించారు. ప్రతి గ్రామంలో నెలకు రెండుసార్లు ఈ వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గ్రామంలో వృద్ధులు, చిన్నారులు, గర్భిణుల ఇళ్ల వద్ద వైద్య పరీక్షలు అందించామన్నారు. గ్రామంలో 66 రకాల మందులు అందుబాటులో ఉన్నాయన్నారు.
గిజబలో వైద్యశిబిరం
గరుగుబిల్లి: మండలంలోని గిజబలో గురువారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంత మైంది. ఉచిత మెగావైద్య శిబిరాన్ని సర్పంచ్ మండల భాగ్యలక్ష్మి ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా రాగోలు జెమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్యశిబిరంలో కార్డియాలజిస్ట్ డాక్టర్ కల్యాణ్ చక్రవర్తి, డాక్టర్ శిరీష, డాక్టర్ రాజేష్‌తో పాటు కంటి వైద్య నిపుణులు తనిఖీలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో దాదాపు వంద మందికి తనిఖీలు నిర్వహించడంతో పాటు ఉచితంగా మందులను అందజేశారు. ఇందులో ఆపరేషన్లకు గుర్తించిన వారిని రాగోలు జెమ్స్ హాస్పిటల్లో ఆపరేషన్లను డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో ఆపరేషన్లు చేయడం జరుగుతుందని అసిస్టెంట్ మేనేజర్ పి రాజేశ్వరరావు, ఏరియా మేనేజర్ కె.రమేష్ తెలిపారు. ఉచిత మెగావైద్య శిబిరంలో ఎంపిటిసి సభ్యులు మరడాన సింహాచలం నాయుడు, మాజీ సర్పంచ్ మరడాన కృష్ణమూర్తి నాయుడు, వైసిపి మండల నాయకులు మండల శంకర్రావు, వార్డు సభ్యులు ఎం.సత్తిబాబు, పిఆర్‌ఒ అరసాడ రాజు తదితరులు పాల్గొన్నారు.










