జలుబు, దగ్గు, జ్వరాలతో అల్లాడుతున్న ప్రజలు
వైద్యసేవలు అందక మంచాల్లోనే మగ్గుతూ అవస్థలు
ప్రజాశక్తి -అనంతగిరి : మండలంలోని మారుమూల రొంపల్లి పంచాయతీ చిన్నకోనెల, బూరిగ గ్రామాలలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. సరైన వైద్యం అందక గిరిజనులు అల్లాడిపోతున్నారు. గత కొన్ని రోజులుగా ఇంటింటా దగ్గు, జలుబు, అధిక శరీర ఉష్ణోగ్రతతో జ్వరాలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే దిక్కులేదని వాపోతున్నారు. సోమెల సన్యాసి, సోమెల వీరయ్య, జన్ని. కొత్తమ్మ, బూరిగ. చిన్న జోకులు, బూరిగ. గంగమ్మ, బూరిగ. మల్లమ్మ, బూరిగ. లచ్చమ్మ, బూరిగ పెంటయ్య, సోమెల సన్యాసితోపాటు చిన్న కోనల గ్రామంలో మరో ఎనిమిది మంది జ్వరాలతో బాధపడుతున్నారని ఆయా గ్రామస్తులు తెలిపారు. వారం రోజుల కిందట చిన్నపిల్లలకు వాంతులు విరోచనాలు కావడంతో విజయనగరం జిల్లా మెంటాడ ప్రభుత్వ ఆసుపత్రికి డోలి సహాయంతో వైద్యం నిమిత్తం తరలించగా, అక్కడ వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు మలేరియా, టైఫాయిడ్‌గా నిర్థారించారని తెలిపారు. గ్రామంలో అనేకమంది అల్లాడుతున్నా పట్టించుకోకపోవడంపై ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, వైద్యం శిబిరం నిర్వహించి వైద్యసేవలుఅందించాలని, ఆయాగ్రామాల్లో జ్వరాలు తగ్గుముఖం పట్టేవరకు వైద్యశిబిరాలు నిర్వహించాలని కోరారు. దీనిపై అల్లూరి జిల్లా కలెక్టర్, పాడేరు ఐటిడిఎ పిఒకు ఫోను ద్వారా సమాచారం అందించామని, వారి స్పందన కోసం చూస్తున్నామని గ్రామస్తులు సన్యాసి తదితరులు తెలిపారు.










