సీతంపేట: మండలంలోని దోనుబాయి, దారపాడు, చిన్నపల్లంకి, పెద్దపల్లంకి గ్రామాల్లో ఐటిడిఎ పిఒ కల్పనకుమారి బుధవారం పర్యటించారు. దారపాడులో రైతు భరోసా కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కేంద్రం నాణ్యతా లోపాలు ఉండడాన్ని గమనించారు. అలాగే దోనుబాయి రైతు భరోసా కేంద్రాన్ని కూడా పరిశీలించారు. అక్కడ కూడా నాణ్యతా లోపాలు ఉండడంపై సంబంధిత ఎఇ, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వర్క్ ఇన్స్పెక్టర్లకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. అంతేకాక వారం రోజుల్లో చివరిదశ పనుల్లో ఉన్న భవనాలను వెంటనే పూర్తి చేసి అప్పగించాలన్నారు. దోనుబాయి గ్రామ సచివాలయ భవనం పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. చిన్నపల్లంకి, పెద్ద పల్లంకి గ్రామాలను పరిశీలించారు. చిన్నపల్లంకిలో మలేరియా, డెంగీ కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ రిపోర్టులో తక్కువ కేసులు ఉన్నట్టు చూపించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మెడికల్ ఆఫీసర్, ఎఎన్‌ఎం, సిహెచ్‌డబ్ల్యు, ఎంఎల్‌హెచ్‌పి, పంచాయతీ సెక్రటరీలపై చర్యలు తీసుకోవాలని సంబంధించిన అధికారులకు ఆదేశించారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని, మెడికల్ క్యాంపు నిర్వహించాలని అన్నారు. గ్రామంలో మళ్లీ మలేరియా, డెంగీ కేసులు రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










