Apr 08,2023 23:37

గొడుగులతో ఊరేగిస్తున్న గిరిజనులు

ప్రజాశక్తి -పాడేరు: మన్యంలో ఇటుకుల పండుగ సందడి మొదలైంది. మండల కేంద్రంలోని పాత పాడేరులో శనివారం సాయంత్రం ఇటుకుల పండగలో భాగంగా బడ్డు ఉత్సవం నిర్వహించారు. అన్నదమ్ములు వర్సెస్‌ బామ్మర్దులు మధ్య బలా బలాల పోటీ రసవత్తరంగా సాగింది. ఇరువైపుల వారు గెలుపు కోసం బడ్డు లాగే బల ప్రదర్శన చివరిదాకా ఉత్కంఠగా.. రసవత్తరంగా సాగింది. చివరికి అన్నదమ్ములే గెలుపు సాధించారు. గిరిజనులు నిర్వహించుకునే పండుగలు వారి జీవన విధానాన్ని ప్రతిబింబం చేస్తాయి. ఇటుకుల పండుగలో భాగంగా గ్రామంలో ఆదివారం అక్కాచెల్లెళ్ళు, వదిన మరదళ్ల మధ్య బడ్డు ఉత్సవం జరుగుతుంది.
గొడుగులతో ఊరేగింపు
పెదబయలు రూరల్‌: మండలంలోని సీతగుంట గ్రామంలో ఇటుకల పండగ ఘనంగా నిర్వహించారు. గిరిజన సంప్రదాయం ప్రకారం గ్రామ పెద్దలు గ్రామ చావడి వద్ద వెదురుతో తయారు చేసిన గొడుగులను పూల మాలలతో అలంకరించి ఇంటింటా ఊరేగించారు. నాలుగు రోడ్ల కూడలిలో గ్రామ దేవత, ఆటవి దేవత లకు తుడుం, డప్పు వాయిద్యాలతో పూజలు నిర్వహించారు. ఆచార ప్రకారం 3 రోజులు పండగను ముగించుకొని ఆదివారం అడవిలోకి యువకులు వేట కు వెళతారు. అటవీ జంతవులను వేటాడి గ్రామ చావడి లేక రక్ష బండ వద్ద ఇటుకల పండగను ముగిస్తారు.