Jan 26,2023 00:00

గిరిజన సంఘం ఆధ్వర్యాన తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న ఆదివాసీలు

ప్రజశక్తి-రాజవొమ్మంగి
గిరిజన హక్కులు, చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని, కొండపోడు భూమినే నమ్ముకుంటూ సాగు చేస్తున్న గిరిజనులకు హక్కు పత్రాలు కల్పించాలంటూ గిరిజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం రాజవొమ్మంగి తహాసీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. తొలత స్థానిక యూనియన్‌ బ్యాంకు నుండి తహసీల్దార్‌ కార్యాలయం వరకు గిరిజనలు పెద్ద సంఖ్యలో ప్రదర్శన నిర్వహించారు. తహశీల్దారు కార్యాలయం వద్ద ధర్నా చేపట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోతా రామారావు మాట్లాడుతూ 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, అటవీ హక్కుల చట్టం ప్రకారం సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టా ఇవ్వాలని డిమాండ్‌ చేసారు. పోరాడి సాధించుకున్న గిరిజన చట్టాలు జీవోలు కోర్టు తీర్పులు పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కావాలని రద్దు చేయిస్తున్నాయని విమర్శించారు. గతంలో జీవో నెంబర్‌ 3ని సుప్రీం కోర్టు రద్దు చేస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టనట్టు ఉన్నాయని, ఇప్పుడు 1/70 చట్టాన్ని హైకోర్టు విచారణకు అనుమతి ఇచ్చిందని, కోర్టు అనుమతికి వ్యతిరేకంగా గిరిజనులు నిరసనలు చేస్తుంటే ప్రభుత్వాలు చోద్యం చూస్తున్నాయని విమర్శించారు. తక్షణం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1/70 చట్టం పై సుప్రీంకోర్టు లో అప్పీలు దాకాలాలు చేయాలని డిమాండ్‌ చేశారు. గిరిజన సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు కోండ్ల సూరిబాబు, కుంజం జగన్నాథం మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టం ప్రకారం గిరిజనులు సాగు చేసుకుంటున్న కొండపోడు భూములకు ప్రతి గిరిజనుడికి పది ఎకరాలకు హక్కు పత్రం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక తహశీల్దార్‌ సుబ్రహ్మణ్య ఆచారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల నాయకులు కాళ్ళ రాజుబాబు, పెయ్యాల పాపారావు, జర్తా రాజుబాబు, పొత్తూరు సత్యనారాయణ, పి రాంబాబు, పి సత్యనారాయణ. పెద్ద సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.