ప్రజాశక్తి-పాడేరు: రాజకీయ లబ్ధి కోసం గిరిజనుల హక్కులను చట్టాలను కాలరాస్తే సహించబోమని ఏపీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి కిల్లో సురేంద్ర హెచ్చరించారు. పాడేరులో ఏపీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు పాలికి లక్కు అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సురేంద్ర మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లో అటవీ వనరులను కార్పొరేట్ కంపెనీ లకు అప్పగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తెలిపారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి తన వ్యక్తిగత రాజకీయ అవసరాల కోసం ప్రధాని మోడీ మిత్రులైన అదానీ, శ్రీ సాయి ఎలక్ట్రికల్ లిమిటెడ్‌కు హైడ్రో పవర్ ప్రాజెక్టును అప్పగించాలని క్యాబినెట్ సమావేశంలో ఆమోదించడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం 1/70 చట్టానికి, సుప్రీం కోర్టు తీర్పు కి విరుద్ధంగా ఉందని అన్నారు. కేంద్ర అటవీ సంరక్షణ చట్టం సవరణకు కేంద్రం ప్రభుత్వం ఈ పార్లమెంటు సమావేశాలలో సవరణ బిల్లు ప్రవేశ పెట్టాలని అఖిల పక్ష సమావేశంలో ఎజెండా పెట్టిందని, చట్ట సవరణలు అనంతరం అటవీ ప్రాంతంలో మైనింగ్, పవర్ ప్రాజెక్టు లను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే పక్రియ సులభతరం కానుందని తెలిపారు.గిరిజన గ్రామ సభ ఆమోదం, గిరిజన సలహా మండలి (టి. ఏ.సి) తీర్మానం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా కార్పొరేట్ సంస్థలకు హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అప్పగించడం సరైంది కాదన్నారు.గిరిజనుల అభిప్రాయానికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం అన్యాయన్నారు. ప్రభుత్వ వైఖరిని గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. జీవో నెంబర్ 3 పునరుద్ధరణ కోసం క్యాబినెట్లో ఏనాడూ చర్చ పెట్టకుండా గిరిజన ప్రాంతాన్ని సర్వనాశనం చేయాల నుకోడం అన్యాయమన్నారు. విద్యా సంస్థలలో విద్యార్థి, గిరిజన ప్రజా సంఘాలు ప్రవేశం నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం ప్రజాస్వామ్యానికి చీకటి రోజని తెలిపారు.ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన సబ్ ప్లాన్ నిధులను దారిమల్లించి నవరత్నాలు అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా అధ్యక్షలు పాలికి లక్కు, కొమ్మ పృద్వి, జిల్లా కమిటీ సభ్యులు బోనంగి రామన్న, మట్టముక్క శ్రీను, జీనబంధు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










