ప్రజాశక్తి-కొయ్యూరు
గిరిజన చట్టాలు, హక్కుల పరిరక్షణకు ఆదివాసీలంతా ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.సూరిబాబు పిలుపునిచ్చారు. కొయ్యురు మండలం రోడ్డు చింతలపూడిలో గిరిజన సంఘం మండల మహాసభ ఆ సంఘం నాయకులు పి.బొంజన్న మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ బోయ వాల్మీకిలు, బెంతు, ఒరియాలను ఎస్‌టి జాబితాలో చేర్చుతూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైడ్రో పవర్ ప్రాజెక్టుకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని, జిఒ 3ను పునరుద్ధరించాలని, 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, అటవీ హక్కుల చట్టం-2006ని పటిష్టంగా అమలు చేసి పోడు భూముల సాగు చేస్తున్న గిరిజనులందరికీ 10 ఎకరాలకు తగ్గుకుండా పట్టాలివ్వాలని కోరారు. నూతన అటవీ పాలసీని వెనక్కి తీసుకోవాలని, స్పెషల్ డిఎస్‌సి ప్రకటించి నూరు శాతం పోస్టులతో భర్తీ చేయాలని, అన్నిశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కొయ్యూరులో 50 పడకల ఆసుపత్రి, పెదమాకవరం కేంద్రంగా పిహెచ్‌సిని ఏర్పాటు చేయాలన్నారు. మండలంలో జీడి పిక్కలకు ధర లేకపోవడంతో దళారుల పాలవుతుందని, దీని వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అందువల్ల జీడి పిక్కలను ఐటిడిఎ, జీసీసీ ద్వారా కొనుగోలు చేయాలని, గిరిజనులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గిరిజన సంఘం మండల కమిటీ ఎన్నికైంది. సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులుగా జంపా పెంటయ్య, పాంగి గంగరాజు, 12 మంది కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వై.అప్పలనాయుడు, గిరిజన సంఘం నాయకులు ఎల్.రమేష్, పి.వరహాలు, శ్రీను, మల్లేష్, రాంబాబు, మేడ కన్నయమ్మ, కె.రాజులమ్మ, పి.బొజ్జన్న, కె.శంకర్, కన్నయమ్మ పాల్గొన్నారు.










