ప్రజాశక్తి- విఆర్.పురం
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆదివాసీ చట్టాలు, హక్కులకు భంగం కలిగిస్తుందని, తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం బిజెపి విధానాలకు తలాడిస్తూ గిరిజనులకు ముప్పు తలపెడుతున్నారని సిపిఎం నాయకులు విమర్శించారు. కేంద్ర బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు సిపిఎం, సిపిఐ సంయుక్తంగా ప్రచార భేరి నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మండలంలోని చిన్న మట్టపల్లి పంచాయితీ పరిధి గుండుగూడెం గ్రామంలో శుక్రవారం ప్రచార భేరి నిర్వహించారు. ఉపాధి హామీ పని ప్రదేశాన్ని సందర్శించి కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం మండల నాయకులు వడ్లాది రమేష్, కుంజ నాగిరెడ్డి మాట్లాడుతూ ఉపాధి లేక పూట కూలీల జీవనం అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కూలీలకు రోజుకు కూలి రూ.150 పడుతుందని, రూ.600 చెల్లించాలని డిమాండ్ చేశారు. కూలీలకు రావాల్సిన అలవెన్స్‌లు, మజ్జిగ, తాగునీరు, మెడికల్ కిట్టులు, టెంట్ ఇవ్వాలని, గునపం, తట్ట, పారకు కూలి ఇవ్వాలని కోరారు.
మోతుగూడెం : చింతూరు మండలం తూలుకొండ, దబ్బాగూడెం గ్రామాల్లో సిపిఎం నాయకులు శుక్రవారం ప్రచార భేరి నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు పల్లపు వెంకట్ ఉపాధి హామీ పనులు చేస్తున్న కార్మికులను కలుసుకొని బీజేపీ పాలన వల్ల జరుతున్న నష్టాన్ని, కార్మికులకు బీజేపీ చేస్తున్న ద్రోహాన్ని వివరించారు. మే 4న జరగనున్న బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరారు.
4న బహిరంగ సభను జయప్రదం చేయండి
విఆర్ పురం : కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఐ, సిపిఎం కేంద్ర కమిటీల పిలుపు మేరకు నిర్వహిస్తున్న ప్రచార భేరి సందర్భంగా మే 4న చింతూరులో జరగనున్న బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు పిలుపునిచ్చారు. మండలంలోని చిన్నమట్టపల్లి గ్రామంలో శుక్రవారం బహిరంగ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సభపై ఇప్పటికే సిపిఎం, సిపిఐ నాయకులు, కార్యకర్తలు గ్రామ గ్రామాన కరపత్రాలు, గ్రూప్ మీటింగ్‌లు ద్వారా ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. నేడు బిజెపి ప్రభుత్వం ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను ధ్వంసం చేస్తూ హైందవ ఆధిపత్య సంస్కృతిని గిరిజనులపై రుద్దుతుందని తెలిపారు. ఒకే భాష, ఒకే విద్య, ఒకే మతం అంటూ, భారత దేశ భిన్నత్వాన్ని దెబ్బతీస్తుందని, కట్టుకునే బట్ట, తినె తిండిపైనా ఆంక్షలు విధిస్తుందని విమర్శించారు. అమాయక ఆదివాసీల బుర్రల్లో విషాన్ని నింపుతుందన్నారు. ఈ భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం శాఖ కార్యదర్శి సున్నం దూలయ్య, నాయకులు చంద్రయ్య, రత్తయ్య, రాముడు, సున్నం రాముడు, రాజయ్య, కృష్ణమూర్తి పాల్గొన్నారు.










