- కాకవాడ ఆశ్రమ పాఠశాలలో దారుణం
- ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసిన బాధితులు
- విచారణకు ఐటిడిఎ పిఒ ఆదేశం
ప్రజాశక్తి-రంపచోడవరం
మండలంలోని కాకవాడ గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినులపై లైంగిక వేధింపులు చోటుచేసుకున్నాయి. పాఠశాలలో హెచ్‌ఎం భర్త ప్రసాద్ తమ పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని బుధవారం పాఠశాలను సందర్శించిన రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మికి బాధిత బాలికలు తెలియజేశారు. తమ సమస్యలను ఎమ్మెల్యేకు మొరపెట్టుకొని కన్నీటి పర్యంతమయ్యారు. పాఠశాల హెచ్‌ఎం భర్త ప్రసాద్ పాఠశాలలో గిరిజన బాలికల పట్ల లైంగిక పరంగా కామెంట్లు చేయడంతో పాటు స్నానాలు చేసేటప్పుడు, బట్టలు మార్చుకునే సమయంలో బాలికల బాత్రూమ్‌ల్లో చూస్తున్నారని బాలికలు తెలిపారు. పాఠశాల నిర్వహణలో ఎటువంటి అధికారం లేకపోయినా ప్రసాద్ పాఠశాలలోనే ఉంటూ విద్యార్థినులపై పెత్తనం చెలాయిస్తున్నారని ఆరోపించారు. మెనూ ప్రకారం ఆహారం పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను పాఠశాల హెచ్‌ఎం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదన్నారు. ఈ విషయంపై గ్రామస్తుల సహాయంతో ఫిర్యాదు చేశారు. దీనిపై ఐటీడీఏ పీవో సూరజ్ గనోరే స్పందించి జరిగిన సంఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. విద్యార్థుల పట్ల లైంగిక వేధింపులు పాల్పడిన ప్రసాద్‌పై పోలీస్ కేసు నమోదు చేయాలన్నారు. జరిగిన సంఘటనలపై గిరిజన సంక్షేమ డిడి సిహెచ్.శ్రీనివాసరావు బుధవారం పాఠశాలలో విచారణ జరిపి ఐటిడిఎ పిఓకు నివేదించారు. పాఠశాల నిర్వహణ సక్రమంగా లేదని హెచ్‌ఎంపై చర్యలు తీసుకునేందుకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషాలపై కఠిన చర్యలు తీసుకోవాలని గిరిజన నాయకులు డిమాండ్ చేశారు.










