
భూషణం, సీతమ్మ దంపతులకు గోవిందు, రాణి అనే ఇద్దరు పిల్లలున్నారు. గోవిందు అబ్బాయని ఎక్కువ గారాబం చేయడంతో మొండిగా తయారయ్యాడు. పిల్లల కోసం ఏం తెచ్చినా అతనికి పెద్దవాటా ఇవ్వాల్సిందే. తినే విషయంలోనే కాదు ఆట బమ్మల విషయంలోనూ అతనిదే పైచేయి. అన్న మీద ప్రేమతో రాణి పేచీలు పెట్టేది కాదు. వయసు పెరిగేకొద్దీ గోవిందు ధోరణి మరీ మొండిగా తయారయ్యింది. రాణిలా బయటపిల్లలు సర్దుకోరు కదా! అని భూషణానికి దిగులుపడింది.
గోవిందు, రాజు కొన్ని రోజులుగా స్నేహంగా ఉంటున్నారు. ఒకే రిక్షాలో బడికి వెళ్లి వచ్చేవాళ్లు. రాజు మామయ్య అమెరికా నుంచి వస్తూ చాక్లెట్లు తెచ్చి ఇచ్చాడు. స్నేహితులందరికీ ఒక్కొక్కరికి ఒక్కో చాక్లెట్ ఇవ్వాలనుకుని స్కూలుకు బయల్దేరాడు రాజు.
'రాజు! అందరితో పాటు నాకు ఒకటిస్తావా? రెండివ్వాల్సిందే' అంటూ పేచీ పెట్టాడు గోవిందు. 'రెండిస్తే అందరికీ చాలవు. ఇష్టమైతే తీసుకో, లేకపోతే లేదు.' అన్నాడు రాజు నిర్మొహమాటంగా.
గోవిందుకి కోపం వచ్చింది. 'అందరితో పాటు నేనంటావా? ఎన్ని కావాలంటే అన్ని నాకు ఇవ్వాల్సిందే.' అంటూ రాజు చేతిలోవి లాక్కున్నాడు. రాజు తిరిగి తీసుకోబోతే నెట్టిపడేశాడు. దాంతో ఆ రోజు నుంచి రాజు గోవిందుతో మాట్లాడటం మానేశాడు. మరోసారి బడిలో దీవెన పుట్టినరోజుకి పిల్లలందరికీ పెన్సిల్ సెట్‌లు ఇచ్చింది. బాల దగ్గర ఆ సెట్‌ను బలవంతంగా లాక్కున్నాడు గోవిందు.
అన్న చేస్తున్న పనులు రాణికి నచ్చటం లేదు. 'నీవు చేసేది తప్పు' అని చెప్పబోతే 'నోర్మూసుకో' అని బెదిరించాడు. అన్నకు తెలియకుండానే జరిగిన విషయమంతా నాన్నకు చెప్పింది రాణి.
'రౌడీ వెధవలా ఏంటా పనులు! పిచ్చివేషాలేస్తే తోలు వలుస్తాను' అంటూ భూషణం కేకలు పెట్టాడు.
'ఏమే! నా మీద చాడీలు చెప్తావా? ఈసారి చెప్పావో గొంతు పిసికి చంపేస్తా' అంటూ స్కూలుకు వెళ్లేటప్పుడు రిక్షాలో కొట్టాడు. తోటిపిల్లలు గోవిందు పేచీకోరన్న ఉద్దేశ్యంతో మాట్లాడటమే మానేశారు.
రానురాను గోవిందంటే పిల్లల్లో భయంతో పాటు, అయిష్టత పెరిగిపోయింది. బడిలోనూ అతనితో స్నేహానికి ఎవరూ ఇష్టపడటంలేదు. ఇంట్లో చెల్లెలూ అంటీముట్టనట్టు ఉండటం మొదలెట్టింది. కొద్దిరోజులు బెట్టుగా ఉన్నా.. క్రమంగా తాను చేసిన తప్పేంటో గోవిందుకి తెలిసి రాసాగింది. పిలిస్తే పలికే స్నేహితులు లేరు. ఆడుకొందాం రమ్మంటే వచ్చేవాళ్లు లేరు. అందరూ తనను దూరం పెట్టడంతో చాలా బాధపడ్డాడు గోవిందు. గతంలోలా కొడుకు ఉత్సాహంగా లేకపోవడం గమనించాడు భూషణం. 'గోవిందూ! నీ స్నేహితులెవరూ రావటం లేదు. నువ్వూ ఆడుకోటానికి వెళ్లటం లేదేంటి?' అంటూ ప్రేమగా అడిగాడు.
'అన్నయ్యంటే అందరికీ కోపం నాన్నా! అందరితో పేచీలే! మాట్లాడితే మొండి, ఆటలాడితే తొండి. ఎవరు రానిస్తారు?' అంటూ మూతి మూడు వంకర్లు తిప్పింది రాణి. గోవిందును ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు భూషణం. 'చూడు నాన్నా! అయినదానికీ కాని దానికీ స్నేహితులతో గిల్లి కజ్జాలు పెట్టుకోకూడదు. ఆటల్లో, పాటల్లో, చదువులో పిల్లలందరితో కలిసిపోవాలి. నీ ప్రవర్తన సరిగా లేదనుకొంటే నీతో ఎవరూ స్నేహం చెయ్యరు!' అంటూ కొడుకికి హితబోధ చేశాడు. తండ్రి మాటలు బాగా తలకెక్కాయి. క్రమంగా తన ప్రవర్తన మార్చుకోవడంతో మునుపటిలా స్నేహితులు రావడం మొదలెట్టారు.
- శివప్రసాద్ వల్లూరు
92915 30714