Jun 17,2023 00:08

చర్చలు జరుపుతున్న గీతం, నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్సిటీ బృందం సభ్యులు

ప్రజాశక్తి-మధురవాడ : అమెరికాలోని బోస్టన్‌లో గల నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్సిటీ గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంతో సంయుక్త అధ్యయనాలు జరపడానికి, బోధన, పరిశోధనలలో పరస్పర సహకారానికి ఆసక్తిని కనబరిచింది. ఈ మేరకు శుక్రవారం గీతం యూనివర్సిటీని నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్సిటీ బృందం సందర్శంచింది. ఈ బృందంతో గీతం అకడమిక్‌ ప్రో వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌ వారియర్‌, స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ డీన్‌ ప్రొఫెసర్‌ సిహెచ్‌ విజయశేఖర్‌, గీతం కెరీర్‌ గైడెన్స్‌ సెంటర్‌ అధిపతి కమాండర్‌ గురుమూర్తి గంగాధరన్‌, డిప్యూటీ డైరక్టర్‌ డాక్టర్‌ బి.రవికాంత్‌ సమావేశం అయ్యారు.
నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ డీన్‌ ప్రొఫెసర్‌ కె.సాగర్‌ మాట్లాడుతూ, తమ విశ్వవిద్యాలయంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు. నార్త్‌ ఈస్ట్రన్‌ యూనివర్సిటీ సీనియర్‌ డైరక్టర్‌ మరియమ్మ థామస్‌ మాట్లాడుతూ, పెద్ద సంఖ్యలో గీతం విద్యార్థులు బోస్టన్‌లోని తమ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు పొంది బోధన, పరిశోధనలలో అత్యుత్తమ ప్రతిభ కనబరచడం గీతంతో సంయుక్త ఒప్పందాలు కుదుర్చుకునేందుకు దారితీసిందన్నారు. రెండు విశ్వవిద్యాలయాల మధ్య రానున్న రోజులలో బలమైన అకడమిక్‌ సంబంధాలు నెలకొనగలవన్న ఆశా భావం వ్యక్తం చేశారు.
గీతం అకడమిక్‌ ప్రో వైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ జయశంకర్‌ వారియర్‌ మాట్లాడుతూ, ప్రపంచంలోని ప్రసిద్ద విశ్వవిద్యాలయాలు, కార్పోరేట్‌ సంస్థలతో భాగస్వామ్యం ద్వారా విద్యార్థులకు అత్తుత్తమ విషయ పరిజ్ఞానం అందించాలన్నది తమ లక్ష్యం అన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో భారత ప్రభుత్వ నూతన విద్యా విధానానికి అనుగుణంగా ఉన్నత విద్యను గీతం ద్వారా అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ ఇంజినీరింగ్‌ విభాగాల అధిపతులు, సీనియర్‌ ప్రొఫెసర్లు పాల్గొన్నారు.