Aug 02,2023 23:54

మలేషియా వర్సిటీ బృందాన్ని సన్మానిస్తున్న శ్రీభరత్‌ తదితరులు

ప్రజాశక్తి-మధురవాడ : గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం స్కూల్‌ ఆఫ్‌ లా ద్వారా 2023-24 విద్యా సంవత్సరంలో న్యాయ విద్యను అభ్యసించడానికి ప్రవేశాలు పొందిన నూతన విద్యార్థులకు బ్రిడ్జి కోర్సును బుధవారం న్యాయ నిపుణుల సమక్షంలో ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హజరైన ప్రముఖ న్యాయ నిపుణుడు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మాజీ వైస్‌ ఛాన్సలర్‌ ఎ.రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ, న్యాయ విద్యను అభ్యసించిన ప్రతి ఒక్కరూ వృత్తి నైపుణ్యాలను పెంచుకోవడానికి అధ్యాపకులతో ముఖాముఖి చర్చలతో పాటు వివిధ జర్నల్స్‌ను పరిశీలించి స్వయంగా నోట్స్‌ తయారు చేసుకోవడం అవసరమన్నారు. న్యాయ అంశాలను లోతుగా పరిశీలించి విశ్లేషణాత్మక దృష్టితో అవగాహన చేసుకోవాలన్నారు. విశాఖపట్నం బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు వి.రవీంద్రప్రసాద్‌ మాట్లాడుతూ, కాలానుగుణంగా మారుతున్న చట్టాలపై, వివిధ కోర్టులు ఇచ్చే తీర్పులపై అవగాహన పెంచుకోవాలన్నారు. న్యాయ విద్యను అభ్యసించే వారు కోర్టు హాలులో సీనియర్‌ న్యాయవాదులు పర్యవేక్షణలో వృత్తి నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. గీతం వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ దయానంద సిద్ధవట్టం మాట్లాడుతూ, న్యాయ విద్యను అభ్యసించే వారు ఇతర రంగాల పైన అవగాహన కలిగి ఉండాలన్నారు. గీతం ప్రొవైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ వై.గౌతమరావు మాట్లాడుతూ, నూతన విద్యావిధానంలో వచ్చిన మార్పులకనుగుణంగా గీతంలో న్యాయ విద్యను అభ్యసించే విద్యార్థులకు సైన్స్‌, మేనేజ్‌మెంట్‌, సామాజిక శాస్త్రాలలో నచ్చిన సబ్జెక్టును మైనర్‌ సబ్జెక్టుగా ఎంచుకునే వీలు కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గీతం స్కూల్‌ ఆఫ్‌ లా డైరక్టర్‌ ప్రొఫెసర్‌ అనితారావు, నూతన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.