Aug 01,2023 00:06

పట్టాలందుకుంటున్న వైద్య విద్యార్థులు

ప్రజాశక్తి -మధురవాడ : గీతం ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రిసెర్చి (జిమసర్‌) వైద్యకళాశాల 2017-18 బ్యాచ్‌ ఎమ్‌బిబిఎస్‌ విద్యార్థుల పట్టభద్రుల దినోత్సవాన్ని సోమవారం వైద్యకళాశాల ఆవరణలో ఘనంగా నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు వైద్య డిగ్రీలను అందుకున్నారు. ఈ సందర్భంగా పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు ప్రొఫెసర్‌ సంజరు జోడ్పే ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. యువ వైద్యులు నిరంతర పరిశోధకులుగా, సమాజ పరిస్థితులను అర్థంచేసుకుంటూ ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు.
గీతం అధ్యక్షుడు ఎమ్‌.శ్రీభరత్‌ మాట్లాడుతూ దేశంలోని వైద్య కళాశాలలో వైద్య పరిశోధనలు శాతం పెరగాల్సి ఉందన్నారు. ముఖ్యంగా కోవిడ్‌-19 అనుభవాలతో భవిష్యత్తులో ఎదురయ్యే కరోనా తరహ మహమ్మారులను సమర్ధంగా ఎదుర్కోవాలన్నారు. గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ దయానంద సిద్దవటం మాట్లాడుతూ, గీతంలో నూతన ఔషధాల అన్వేషణపై వివిధ విభాగాల కలయికతో జరుగుతున్న పరిశోధనల ప్రగతిని వివరించారు. గీతం మెడికల్‌ సైన్సెస్‌ ప్రో-వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ బి. గీతాంజలి, డీన్‌ డాక్టర్‌ ఎస్‌.పి.రావు మాట్లాడుతూ వైద్య విద్యలో వస్తున్న మార్పులను వివరిస్తూ యువ వైద్యులు నిరంతర విద్య ద్వారా తమ నైపుణ్యాలను పెంచుకోవాలన్నారు. జిమ సర్‌ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఐ.జ్యోతిపద్మజ వార్షిక నివేదికను సమర్పించారు. కార్యక్రమంలో గీతం పాలక మండలి సభ్యుడు తపోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థి డాక్టర్‌ సి.లోకేష్‌కు గీతం ప్రెసిడెంట్‌ బంగారు పతకాన్ని అందించారు. పలువురు విద్యార్థులకు ప్రతిభా పురష్కారాలు అందజేశారు.