
ప్రజాశక్తి-మధురవాడ : భారత ప్రభుత్వ యువజన, క్రీడల మంత్రిత్వ శాఖ నెహ్రు యువ కేంద్ర ఆధ్వర్యాన కాశ్మీర్‌లోని వివిధ జిల్లాల నుంచి విశాఖ వచ్చిన 120 మంది యువత శుక్రవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో సందడి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర రాష్ట్ర డైరక్టర్ ఎ.విజయరావు మాట్లాడుతూ, కాశ్మీర్ యువత భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ ద్వారా కాశ్మీరి యూత్ ఎక్సైంజ్ కార్యక్రమాన్ని విశాఖలో అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించామని తెలిపారు. కాశ్మీరి యువతకు దేశ శాస్త్ర, సాంకేతిక రంగాలలో సాధిస్తున్న ప్రగతిని తెలియజేయడం పారిశ్రామిక అభివృద్ధి, దేశంలోని వివిధ ప్రాంతాలలో యువత ఆకాంక్షలను తెలుసుకునే అవకాశం కల్పించడం కార్యక్రమం ముఖ్యఉద్దేశమని తెలిపారు. గీతం స్టూడెంట్ లైఫ్ డైరక్టర్ డాక్టర్ రీమా చౌదరి మాట్లాడుతూ, ప్రభుత్వం యువతను ప్రోత్సహించడానికి నైపుణ్యాలను పెంచే కార్యక్రమాలతో పాటు స్టార్టప్‌లను సహితం ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తోందన్నారు. గీతం ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ కె.సురేష్‌కుమార్ యువత సేవా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. గీతం కెరీర్ గైడెన్స్ సెంటర్ డైరక్టర్ ఎస్.వంశీకిరణ్ వివిధ కోర్సుల ద్వారా లభించే ఉపాధి అవకాశాలను తెలియజేశారు. ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ గోపీనాధ్ ఆధ్వర్యాన గీతం ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. కాశ్మీరీ యువత తమ అభిప్రాయాలను పంచుకోవడంతో పాటు తమ సంస్కృతి సంప్రదాయాలపై అకట్టుకునేలా ప్రదర్శన ఇచ్చారు.