ప్రజాశక్తి- విశాఖపట్నం : గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ లా ఆధ్వర్యంలలో జాతీయ స్థాయి మూట్ కోర్టు పోటీలు గురువారం ప్రారంభం అయ్యాయి. గీతం మూట్ ఎ అడ్వకసీ కమిటి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 4వ తేదీ వరకు గీతం వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ డాక్టర్ ఎమ్.వి.వి.ఎస్. మూర్తి పేరుతో ఈ పోటీలను వర్చ్యువల్ విధానంలో ప్రముఖ న్యాయ నిపుణల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 22కి పైగా ప్రముఖ న్యాయ విశ్వవిద్యాలయాల నుంచి దాదాపు 200 మంది న్యాయ విద్యార్ధులు ఈ పోటీలలో పాల్గొనున్నారు.
కాగా పోటీలను లాంఛనంగా ప్రారంభించిన గీతం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ దయానంద సిద్దవట్టం మాట్లాడుతూ దేశంలోని విశ్వవిద్యాలయాలలో 20 సంవత్సరాల క్రిందటి వరకు మేధోహక్కుల (ఐపిఆర్) పై పెద్దగా అవగాహన లేదని ఐతే శాస్త్ర విజ్ఞానం పెరుగుతుండటం, ప్రభుత్వ ప్రత్యేక దృష్ఠి కారణంగా పేటెంట్ ధరఖాస్తుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఐపిఆర్ చట్టాల కారణంగా మానవ జీవన ప్రమాణం పెంచే ఔషధాల ధరలు అందరికి అందుబాటులో వచ్చాయన్నారు. మేదో హక్కులకు పెరుగుతున్న ప్రాధాన్యత కారణంగా ఔషధ రంగంతో సహ వివిధ శాస్త్ర ప్రయోగశాలలు, విశ్వవిద్యాలయాలు ఐపిఆర్ విభాగాలను నెలకొల్పడం సహ నిపుణులను సహితం నియమించుకుంటున్నాయని తెలిపారు. మేధోహక్కులపై మూట్‌కోర్టు పోటీలను నిర్వహించడాన్ని ఆయన అభినందించారు. గీతం అధ్యక్షుడు ఎమ్.శ్రీభరత్ మాట్లాడుతూ సామాన్యులకు సహితం న్యాయం జరుగుతుందన్న నమ్మకాన్ని న్యాయవ్యవస్థ ద్వారా ప్రజలలో పెంచాల్సిన బాధ్యత యువతరంపై ఉందన్నారు.
విశాఖ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.రవీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ న్యాయ విద్యను అభ్యషించే యువతకు వృత్తిలో ప్రవేశించడానికి ముందు ప్రాక్టికల్ శిక్షణగా మూట్‌కోర్టు పోటీలు ఉపయోగ పడతాయన్నారు. నవ సమాజ నిర్మాణానికి పటిష్టమైన న్యాయవ్యవస్థ అందుకు తగ్గ నిపుణులు అవసరమన్నారు. చట్టాలను లోతుగా అర్ధం చేసుకుని సందర్భానికి తగిన విధంగా అన్వయించుకోవడానికి తగ్గ నైపుణ్యం మూట్ కోర్టు పోటీల ద్వారా కలుగుతుందన్నారు. విద్యార్ధుల మద్య జరిగే చర్చల ద్వారా నూతన ఆలోచనలకు మార్గం ఏర్పడుతుందని తెలిపారు. గీతం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డి.గుణశేఖరన్ మూట్‌కోర్టు పోటీల నిర్వహణ ద్వారా విద్యార్ధుల ప్రతిభను వెలికి తీయవచ్చునన్నారు.
గీతం న్యాయ కళాశాల డైరక్టర్ ప్రోఫెసర్ అనితారావు మాట్లాడుతూ న్యాయ వృత్తిలో పాటించాల్సిన మెళకువలుపై విద్యార్ధులకు ప్రాక్టికల్ అనుభవాన్ని అందించడంతో పాటు, వాదోపవాదాలపై న్యాయస్థానంలో వృత్తి నైపుణ్యాన్ని పెంచటానికి ఈ మూట్ కోర్టు పోటీలను గత మూడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. మేధోహక్కులపై ఈ ఏడాది మూట్ కోర్టు పోటీని సెప్టెంబర్ 4వ తేదీవరకు నిర్వహిస్తున్నామన్నారు. విజేతలకు నగదు బహుమతులు అందజేస్తామన్నారు.










