ప్రజాశక్తి-మధురవాడ : అజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం టెక్సాలజీ ఎనేబిలింగ్ సెంటర్ (జి-టెక్) ఆధ్వర్యాన పూణేలోని సిఎస్‌ఐఆర్ నేషనల్ కెమికల్ లేబరేటరీ సహకారంతో జాతీయ మేధోహక్కుల ఉత్సవాన్ని శనివారం నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ కళాశాలలు, పరిశ్రమల నుంచి 700 మంది హజరయ్యారు. సిఎస్‌ఐఆర్ నేషనల్ కెమికల్ లేబరేటరీ మేధో హక్కుల విభాగం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ నితిన్ తివారి ముఖ్యఅతిథిగా హజరై మాట్లాడారు. విద్యాలయాలలోని ప్రయోగశాలలలో జరిగే అధ్యయనాలు వాటి ఫలితాలు పారిశ్రామిక ఉత్పత్తులుగా మారాలన్నారు. పరిశోధన ఫలితాలను విధిగా మేధోహక్కుల కింద నమోదు చేసుకోవాలని సూచించారు. గీతం రీసెర్చి విభాగం డైరక్టర్ డాక్టర్ రాజా పప్పు మాట్లాడుతూ, గీతం లోని జిటెక్ విభాగం ద్వారా పరిశ్రమలకు, విద్యాలయాలకు మధ్య సంబంధాలను నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నామన్నారు. జి-టిక్ కోఆర్డినేటర్ సోమ్ భట్ కార్యక్రమ ప్రాధాన్యతను తెలియజేశారు.










