ప్రజాశక్తి- విశాఖపట్నం: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న గీతం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చి (జిమ్సర్) వేదికగా ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ మెడికల్ మైక్రోబయాలజిస్ట్స్ (ఐఎఎంఎం) ఆంధ్రా, తెలంగాణా ఛాప్టర్ వార్షిక సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలను జిమ్సర్ ప్రో వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ బి.గీతాంజలి ప్రారంభించారు. జిమ్సర్ వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జ్యోతిపద్మజ, గీతం కార్యదర్శి ఎమ్.భరద్వాజ, నిర్వాహక కమిటీ సంయుక్త కార్యదర్శి డాక్టర్ పి.హేమాప్రకాష్ కుమారి పాల్గొన్నారు. సమావేశాలలో మొదటి రోజు 'కలియుగంలో క్లీనికల్ మైక్రోబయాలజీ' అనే అంశంపై ప్రముఖ మైక్రో బయాలజిస్ట్ డాక్టర్ ఎన్.రంగనాధన్ అయ్యర్ ప్రసంగించగా, 'ట్రాన్స్‌లేషనల్ రీసెర్చి' పై డాక్టర్ వి.లక్ష్మి మాట్లాడారు.. ఇనిస్టిట్యూట్ ఆఫ్ జినోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ నిపుణుడు డాక్టర్ వై.వంశీకృష్ణ, డాక్టర్ అరుణ్ కౌశిక్ ప్రసంగించారు. వైద్య విద్యార్థుల సాంస్కతిక ప్రదర్శనలు అలరించాయి.










