Jul 09,2023 23:19

అడ్మిషన్ల కౌన్సెలింగ్‌కు హాజరైన విద్యార్థులు

ప్రజాశక్తి-మధురవాడ : గీతమ్‌ డీమ్డ్‌ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న డిగ్రీ, పీజీ కోర్సులలో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌కు అనూహ్య స్పందన లభించింది. గీతంలో ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌, లా, ఆర్కిటెక్చర్‌, మెడికల్‌, పారామెడికల్‌, ఫార్మశీ, నర్సింగ్‌, ఫిజియోథెరిపి తదితర వృత్తి విద్యాకోర్సులతో పాటు బిఎస్‌సి, బిఎ, బికామ్‌ డిగ్రీ కోర్సులకు ఈ అడ్మిషన్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి హజరైన విద్యార్థులను, తల్లిదండ్రులను ఉద్దేశించి గీతం ప్రోవైస్‌ ఛాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ వై.గౌతమ్‌రావు ప్రసంగించారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా గీతం కోర్సులను రూపకల్పన చేయడంతో పాటు నిపుణులైన బోధన సిబ్బందిని నియమించామని తెలిపారు. ప్రతిభ గల విద్యార్థులను ప్రోత్సహించడానికి ఏటా రూ.50 కోట్ల స్కాలర్‌షిప్‌ల రూపంలో అందజేస్తున్నామన్నారు. విశ్వవిద్యాలయంలో అధునాతన ప్రయోగశాలలతో పాటు రూ.100 కోట్లతో నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. విద్యార్థి గీతంలో ప్రవేశం పొందినప్పటి నుంచి డిగ్రీ అందుకుని వెళ్లేంతవరకు మార్గదర్శకం చేసేలా గీతం కెరీర్‌ గైడెన్స్‌ సెంటర్‌ ద్వారా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు వెల్లడించారు. విద్యార్థులలో స్టార్టప్‌ సంస్కృతిని పెంచడానికి వెంచర్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామన్నారు. గీతం చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌ గోపాలకృష్ణ మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల చదువు గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకునేలా విద్యార్థి హజరు, మార్కుల వివరాలు, హస్టల్‌లో వారు తీసుకునే ఆహారం వరకు పూర్తి సమాచారాన్ని గీతం వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకునే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేశామన్నారు. అధ్యాపకుల తరగతుల రికార్డింగ్‌ పాఠాలు, గీతం గ్రంథాలయంలోని ఈ-రిసోర్సెస్స్‌ను ఇంటి నుంచి, వసతి గృహాల నుంచి చదివే వీలు కల్పిస్తున్నామన్నారు. గీతం ఎక్స్‌టర్నల్‌ రిలేషన్స్‌ డిప్యూటీ డైరక్టర్‌ నవీన్‌ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా లక్ష మంది పైగా గీతం పూర్వ విద్యార్థులు కీలక పదవులలో ఉన్నారని ప్రస్తుత విద్యార్థులకు మార్గదర్శకం చేయడానికి వారి సహకారం తీసుకుంటున్నామన్నారు. గీతం రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ డి.గుణశేఖరన్‌ అడ్మిషన్ల విభాగం అధికారులు, సీనియర్‌ అధ్యాపకులు పాల్గొన్నారు.
ఆదివారం జరిగిన కౌన్సెలింగ్‌లో ఇంటర్మీడియట్‌ తత్సమాన కోర్సులు పూర్తిచేసిన వారికి బిఎస్సీ బయోటెక్నాలజీ, ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, స్టాటస్టిక్స్‌, బిసిఎ, ఫిజియోథెరిపి, బిఫార్మశీతో పాటు బిఎ ఎల్‌ఎల్‌బి, బిబిఎ, బిఎలో ఎకనామిక్స్‌, హిస్టరీ, ఇంగ్లీష్‌, పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజి కోర్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. వీటితో పాటు పారా మెడికల్‌ కోర్సులైన ఆప్టోమెట్రి, మెడికల్‌ ల్యాబ్‌టెక్నాలజీ, ఎమర్జెన్సి మెడికల్‌ టెక్నాలజీ, రీనల్‌ డయాలసిస్‌ టెక్నాలజీ కోర్సులకు ప్రవేశాలు కల్పించారు. డిగ్రీ తత్సమాన అర్హత గల వారికి ఎమ్మెస్సీ డేటా సైన్స్‌, బయోటెక్నాలజీ, ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ కోర్సులలో ప్రవేశం కల్పించారు.