ప్రజాశక్తి- మధురవాడ : గీతం విశ్వవిద్యాలయాన్ని 2040 నాటికి ప్రపంచంలోని అగ్రశ్రేణి విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని చేరడానికి పూర్వవిద్యార్ధులను సహితం భాగస్వామ్యులను చేస్తామని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దయానంద సిద్దపట్టం తెలిపారు. ఈ నెల 17వ తేదీన ''హోమ్ కమింగ్'' పేరిట నిర్వహిస్తున్న గీతం పూర్వవిద్యార్థుల సమావేశ వివరాలను సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. పూర్వవిద్యార్ధుల సహాయంతో ప్రస్తుత విద్యార్థులకు మార్గదర్శక కార్యక్రమాల నిర్వహణతో పాటు గీతం వెంచర్ డెవలప్‌మెంట్ సెంటర్ (విడిసి) ద్వారా స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వనిస్తున్నట్లు తెలిపారు. రానున్న ఏడాదిలో జీవశాస్త్ర స్టార్టప్ ప్రోత్సాహకానికి ''బయోనెస్ట్'' ఏర్పాటుకు సన్నాహలు చేస్తున్నామని వివరించారు. గీతం పూర్వవిద్యార్థి సంబంధాల విభాగం డైరక్టర్ నవీన్ మాట్లాడుతూ, పూర్వ విద్యార్థుల పిల్లలలో 1150 మందికి గీతం స్కాలర్‌షిప్ అందించామని, ప్రస్తుత విద్యార్థులకు ప్రాంగణ నియామకాలకు పూర్వవిద్యార్థులు సహకరిస్తున్నారని తెలిపారు. విదేశాలలో ఉన్న విద్యార్థులు ఏటా తమ భారతదేశపు ప్రయాణంలో పూర్వవిద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనడం అలవాటుగా చేసుకునేందుకు వీలుగా ఏటా డిసెంబర్ 17వ తేదీన ''హోమ్ కమింగ్'' కార్యక్రమం తప్పకుండా నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ విలేకర్ల సమావేశంలో గీతం బిసిజిసి సహయ డీన్ గురుమూర్తి గంగాధరన్, గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్ ప్రొఫెసర్ అమిత్భద్ర, గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డీన్ ప్రొఫెసర్ విజయ శేఖర్, గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ బాలాకుమార్, గీతం దంత కళాశాల సహయ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్య తదితరులు పాల్గొన్నారు.










