Mar 07,2023 22:19

ఎంఎల్‌సి ఎన్నికలపై తమ స్థానిక ప్రజాప్రతినిధులకు వైసిపి అధిష్టానం హెచ్చరికలు
ఓటు తప్పకుండా వేసేలా అధికార పార్టీ వ్యూహాలు
మంత్రి కారుమూరి, మిథున్‌రెడ్డికి జిల్లా బాధ్యతలు
వైసిపికి ముచ్చెమటలు పట్టిస్తున్న ప్రతిపక్షాలు
రసవత్తరంగా ఎంఎల్‌సి సమరం
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

స్థానిక సంస్థల నియోజకవర్గ ఎంఎల్‌సి ఎన్నికల సమరం రసవత్తరంగా మారుతోంది. స్వతంత్ర అభ్యర్థులు అధికారపార్టీకి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులకు ప్రతిపక్ష టిడిపి, జనసేన మద్దతు లభించడంతో ఎన్నికల పోరు హాట్‌టాపిక్‌గా మారింది. జిల్లాలో స్థానిక సంస్థలకు చెందిన రెండు ఎంఎల్‌సి స్థానాలకు ఈ నెల 13న ఎన్నికలు జరగనున్నాయి. జెడ్‌పిటిసిలు, ఎంపిటిసిలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మొత్తం 1,105 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. దాదాపు 870 మంది వైసిపి స్థానిక ప్రజాప్రతినిధులే ఓటర్లుగా ఉన్నారు. దీంతో రెండు ఎంఎల్‌సి స్థానాలు వైసిపికి ఏకగ్రీవంగా దక్కాల్సి ఉండగా స్వతంత్ర అభ్యర్థులు నలుగురు బరిలో నిలవడంతో ఎన్నికలు తప్పలేదు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన వీరవాసరానికి చెందిన వీరవల్లి చంద్రశేఖర్‌కు టిడిపి మద్దతివ్వడంతోపాటు సర్పంచుల ఛాంబర్‌ సైతం మద్దతు పలికింది. ఎంఎల్‌సి ఎన్నికల్లో వైసిపి అభ్యర్థులకు ఓటు వేయొద్దని జనసేన అధినాయకత్వం సైతం పిలుపునిచ్చింది. దీంతో టిడిపి, జనసేన ప్రజాప్రతినిధులు స్వతంత్ర అభ్యర్థి వీరవల్లి చంద్రశేఖర్‌కు ఓటు వేయనున్నట్లు స్పష్టమైంది. టిడిపి, జనసేనకు 217 మంది స్థానిక ప్రజాప్రతినిధులు ఉన్నారు. మరో 250 మంది ప్రజాప్రతినిధులు ప్రతిపక్షాలు బలపరిచిన అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తే ఫలితం తారుమారయ్యే పరిస్థితుంది. ప్రభుత్వంపై స్థానిక ప్రజాప్రతినిధుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. దీంతో ఓట్లు చీలే అవకాశం ఉందని వైసిపి నాయకులు ఆందోళనకు గురవుతున్నారు. ఓట్లు చీలకుండా వైసిపి ప్రజాప్రతినిధులంతా పక్కాగా వైసిపి అభ్యర్థులకే ఓటు వేసేలా వైసిపి నాయకత్వం ప్రణాళికతో ముందుకు సాగుతోంది. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, రీజనల్‌ కోఆర్డినేటర్‌ మిథున్‌రెడ్డికి ఎంఎల్‌సి ఎన్నికల్లో అభ్యర్థులను గెలిపించే బాధ్యత వైసిపి అధిష్టానం అప్పగించింది. వైసిపి తరపున కవురు శ్రీనివాస్‌, వంకా రవీంద్రనాధ్‌ పోటీలో ఉన్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా వీరవల్లి చంద్రశేఖర్‌తోపాటు గోరింక దాసు, పసల వెంకటాచలం, దేవరపల్లి ఆదాం ఉన్నారు. వీరిలో వీరవల్లి చంద్రశేఖర్‌ ప్రధాన పోటీదారుగా ఉన్నారు. దీంతో వైసిపి నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులకు సమావేశాలు నిర్వహించి ఎంఎల్‌సి ఎన్నికల గురించి వివరిస్తున్నారు. ఓటు ఎలా వేయాలి, ఏ విధంగా వేస్తే గెలుపుంటుందో చెబుతున్నారు. డబ్బు పంపిణీ చేయనున్నట్లు మొదట్లో పెద్దఎత్తున ప్రచారం సాగింది. అదే జరిగితే గెలుపోటములు తారుమారయ్యే పరిస్థితి ఏర్పడనుందని వైసిపి నాయకులు అంచనా వేస్తున్నారు. తమ స్థానిక ప్రజాప్రతినిధులతో వైసిపి అగ్రనాయకులు ఒకే అంశాన్ని వివరిస్తున్నారు. ప్రతిఒక్కరూ వైసిపి అభ్యర్థులకే ఓటు వేయాలని లేకపోతే... అంటూ హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఓట్లు చీలిస్తే గెలిచినట్లుగా ప్రతిపక్షాలు ప్రణాళికలు
ఎంఎల్‌సి ఎన్నికల్లో గెలిచేంత బలం లేకపోయినా ప్రతిపక్ష పార్టీలు గట్టి ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. తాము బలపరిచిన అభ్యర్థి గెలిచినా, గెలవకపోయినా వైసిపి ఓట్లు చీలిస్తే విజయం సాధించినట్లేనన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొదటి ఓటు వైసిపి అభ్యర్థికి వేసి, రెండో ఓటు ప్రతిపక్షాలు బలపరిచిన అభ్యర్థికి వేసినా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నట్లుగా స్పష్టమవుతుందని ప్రచారం చేస్తున్నారు. ఇది అధికార పార్టీకి ఇబ్బందికర పరిణామంగా చెబుతున్నారు. ప్రస్తుతం మౌనంగా ఉన్నా ఓటు వేసేటప్పుడు కచ్చితంగా కొంతమంది అధికారపార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు తాము బలపరిచిన అభ్యర్థికి ఓటువేసే అవకాశం ఉందని ప్రతిపక్షాలు అంచనా వేస్తున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు ఏం తీర్పు చెబుతారో ఈ నెల 16న ఓట్ల లెక్కింపు వరకూ వేచిచూడాల్సిందే.