ప్రజాశక్తి - ఉంగుటూరు
వ్యవహారిక భాషాభివృద్ధికి విశేష కృషి చేసిన మహనీయులు గిడుగు రామ్మూర్తి చిరస్మరణీయులని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టికె.విశ్వేశ్వరరావు తెలిపారు. నారాయణపురం శ్రీఅరవింద శతజయంతి ప్రభుత్వం డిగ్రీ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో గిడుగు వెంకట రామమూర్తి 160వ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. వారోత్సవాలలో భాగంగా అంతర్జాల సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్, ముఖ్య వక్తగా విచ్చేసిన ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు డాక్టర్ బూసి వెంకటస్వామి మాట్లాడుతూ భావవ్యక్తీకరణకు భాషే ఆధారం, ఆ భాష పరాయి భాషా ప్రభావానికి గురై ఉనికిని కోల్పోయే స్థితి నుంచి స్వాతంత్రంగా మారడానికి కారణం వ్యవహారిక భాషా ఉద్యమం, దానికి సారధ్యం వహించిన గిడుగు రామమూర్తి, పిడుగులా ఉద్యమాన్ని నడిపిన భాషా సంస్కర్త వెంకట రామమూర్తి అని తెలియజేశారు. తిరువూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ వై.విజయానంద రాజు మాట్లాడుతూ తెలుగు భాషా దినోత్సవం జరుపుకోవడానికి గల నేపథ్యం, కారణాలు వివరిస్తూ మనం ఉపయోగించే భాషా పదాలు వాటి పుట్టుకలను చక్కగా వివరించారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ తరపట్ల సత్యనారాయణ మాట్లాడుతూ వేడుకల సందర్భంగా మాత్రమే తెలుగు భాష మాధుర్యం, గొప్పతనం గురించి చర్చలు చేస్తే సరిపోదు, మిగిలిన రోజుల్లో కూడా అదే వరవడిని కొనసాగించాలన్నారు. తెలుగులో చదువుకున్న విద్యార్థులకు ప్రత్యేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పటిష్టమైన ప్రణాళిక ఏర్పాటు చేసుకొని పోరాటం కొనసాగించకపోతే, మన విద్యార్థులు తెలుగు చదువుకునే అవకాశం ఉండదని, అదే జరిగితే మన ఉనికిని కోల్పోతామని తెలిపారు. ఆదికవి నన్నయ్య తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ వరప్రసాద్, సదస్సు సంచాలకులు డా.కొండా రవి మాట్లాడుతూ ఈ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం మొదలైన పోటీలు నిర్వహించి, ప్రోత్సహించామన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ కళాశాలలకు చెందిన అధ్యాపకులు, ఆచార్యులు, విద్యార్థులు 160 మందికి పైగా పాల్గొన్నారు.










