ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్
కెజిబివి పాఠశాలల్లో పని చేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీని రెన్యువల్ చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్‌డి.అంజిబాబు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట కెజిబివి పాఠశాలలో పని చేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ ఆందోళన చేపట్టారు. అనంతరం కలెక్టర్ డాక్టర్ సృజనను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంజిబాబు మాట్లాడారు. వీరు గతేడాది గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేశారని, మెరిట్ లిస్టు ఆధారంగా, సెలక్షన్ ఆధారంగా, డెమో చేసి వీరిని సెలెక్ట్ చేశారని తెలిపారు. గత రెండేళ్లు పని చేసిన అనుభవం కూడా ఉందని, వీరు అనేక ఇబ్బందులకు గురవుతూ విద్యార్థులకు చదువులు చెప్పారని చెప్పారు. ఇప్పుడు వీరిని తొలగించడం సరైంది కాదన్నారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు కూడా మే 30 వరకు ట్యూషన్ చెప్పి పాసయ్యే విధంగా పని చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వీరిని కాదని కొత్తవారిని తీసుకోవడం సరైంది కాదన్నారు. త్వరలో ప్రకటించబోయే మెరిట్ లిస్టును రద్దు చేసి పాత వారినే గెస్ట్ ఫ్యాకల్టీగా కొనసాగించాలని కోరారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపిస్తామని హెచ్చరించారు. సిఐటియు నాయకులు జయ నాగేశ్వరరావు, గెస్ట్ ఫ్యాకల్టీ నాయకులు కరుణ, శాంతి, శివలక్ష్మి, వేదవతి, వేదవతి, కృష్ణవేణి, చాంద్ బీబీ పాల్గొన్నారు.
కలెక్టరేట్ దగ్గర జరిగిన ధర్నాలో మాట్లాడుతున్న అంజిబాబు










