Jun 13,2021 12:23

పలుగు నాదే పార నాదే
సేద్యం నాదే స్వేదం నాదే
పుట్టిన గింజ
పురిట్లోనే కన్ను మూస్తే
దు:ఖించే కన్నీళ్ళు నావే
చీలికలైన
ధాన్యరాశి కుప్పల మధ్య
చిధ్రం అయ్యేది నేనే
పిచికారీ నాదే
పీచు ముక్క నాదే
రుణాల బండి మీద
సవారి చేసేది నేనే
రెప్పవేయని కంటికి
జోల పాడేది నేనే
ఏరువాక పాట నాదే
ఏకరువు కూత నాదే
కరువు కుంపటి మోసే
ఏకాకితనం కూడా నాదే
ఎడకాలువ వెంబడి
బతుకు పడవై సాగేది నేనే
కాయ పిప్పి వెనుక
నుజ్జు నుజ్జై పోయేది నేనే
కాలు కదిపితే రొక్కం
చేయి కలిపితే ఎక్కం
ఒప్పజెప్పాల్సింది నేనే
పిందె నాదే పండు నాదే
తాలై తేలాల్సింది నేనే
చివరికి ఎర్రమట్టినై
పిడికిలి బిగించి
పోరుకు తలపడాల్సింది నేనే
కర్షకుడిగా తేలిపోవాల్సింది నేనే
నన్ను నేను గెలవాల్సింది నేనే
 

- నరెద్దుల రాజారెడ్డి
96660 16636