Nov 21,2021 09:17

ఆమె 80 శాతం వైకల్యంతో జన్మించారు. అయినా తల్లిదండ్రులు ఆమెను అక్కున చేర్చుకున్నారు. అందరి పిల్లల్లానే ప్రేమను పంచారు. కానీ ఈ సమాజంలో ఎన్నో అవమానాలు అడుగడుగునా ఆమె ఎదుర్కొన్నారు. 'నా పరిస్థితే ఇలా ఉంటే తల్లిదండ్రుల ప్రేమకు నోచుకోని పిల్లల పరిస్థితి ఏమిటి?' అనే ప్రశ్నే ఆమెకు నిద్రలేని రాత్రులను పరిచయం చేసింది. సోదరి, తండ్రి సహాయంతో 'సాంత్వన్‌ విక్లాంగ్‌ వికాస్‌ మండల్‌' అనే ఎన్‌జీవోను స్థాపించి, తనలాంటి వికలాంగులకు ఆసరాగా నిలుస్తున్నారు. ఆమే గుజరాత్‌కు చెందిన 'నీలమ్‌ పర్మార్‌'. తాను జీవితంలో గెలవడమే కాదు.. మరెందరినో గెలిపిస్తూ ముందుకెళుతున్న ఆమె గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం.

జునాగడ్‌కు చెందిన నీలమ్‌ పర్మార్‌ 80 శాతం వైకల్యంతో జన్మించారు. తల్లిదండ్రులు తనని కంటికి రెప్పలా చూసుకోవడం ఆమెకెంతో ఊరటనిచ్చింది. కానీ ఈ సమాజం, బంధుమిత్రులు మాత్రం ఆ కుటుంబాన్ని చాలా చిన్నచూపు చూడటం మొదలెట్టారు. చిన్నప్పుడు ఆమెని ఏ పాఠశాలలో చేర్చాలన్నా ఎవరూ చేర్చుకోలేదు. అతికష్టం మీద పాఠశాలలో చేర్చినా, తోటి పిల్లలు ఆమెను వెక్కిరిస్తూ ప్రతిక్షణం నరకం చూపేవారు. అయినా వాటన్నింటినీ ఆమె లెక్క చేయలేదు. 'నా బాల్యమంతా గడ్డుకాలంగా గడిచింది. ఎన్నో చేదు అనుభవాలను ఎదుర్కొన్నా. అయినా నేను ఎవరినీ నిందించలేదు. నాలాంటి వారిని హేళన చేసే వారికి అవగాహన కల్పించి, మార్పు తీసుకురావాలి అనుకున్నా. నాలా మరొకరు బాధపడకుండా ఉండటానికి ఏదైనా చేయాలి అనుకున్నా. నా సోదరి రేఖ, తండ్రితో కలిసి 2012లో 'సాంత్వన్‌ విక్లాంగ్‌ వికాస్‌ మండల్‌' అనే ఎన్‌జీవోను స్థాపించా. వైకల్యంతో పుట్టిన పిల్లలను కొందరు తల్లిదండ్రులే వదిలేస్తారు. అలాంటివారికి మేమే తల్లిదండ్రులమై ప్రేమతో పాటు తిండి, విద్యను అందిస్తాము. మా సంస్థలో తొమ్మిది నెలల నుంచి 51 సంవత్సరాల మధ్య వయస్సుగల పిల్లలు, పెద్దలు ఉన్నారు. మొదట్లో కేవలం ఇద్దరు బాలికలతో మా సంస్థ ప్రారంభమైంది' అంటోంది నీలమ్‌ పర్మార్‌.
అప్పట్లో ఇంత జ్ఞానం లేదు
'ఈ సంస్థను నడపటానికి మంచి మనసున్న కొందరు విరాళాలు ఇస్తూ ఉంటారు. వాటితోపాటు నేను, నా సోదరి పొదుపు చేసుకున్న డబ్బునూ రోజువారీ ఖర్చులకు ఉపయోగిస్తాం. నా చిన్నప్పుడు వైకల్యం గురించి లోతైన విషయాలు తెలుసుకోవడానికి పెద్దగా సౌకర్యాలు ఉండేవి కాదు. కానీ నేడు అలా కాదు ఇంటర్నెట్‌ ద్వారా చాలా విషయాలు తెలుసుకోవచ్చు. నాలాంటి వారికోసం ఇంకా ఎంతో చేయాలి. ముఖ్యంగా వికలాంగులలోని ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం చెక్కుచెదరకుండా ఉండేలా మేము ప్రయత్నిస్తున్నాము. మా దగ్గర సుమారు 40 మంది పిల్లలు, పెద్దలు ఉన్నారు. మానసికంగా బాధపడే అంతమందిని చూసుకోవడమంటే మాటలు కాదు. అందుకు ఎంతో సహనం కావాలి. అది మా దగ్గర పుష్కలంగా ఉంది' అంటోంది నీలమ్‌ పర్మార్‌.
'నీలమ్‌ అక్కకు చాలా ఆపరేషన్లు చేశారు. అందుకోసం మేము సంవత్సరానికి పైగా ఆసుపత్రిలోనే గడిపాం. అక్కడ వికలాంగులు తీవ్ర మానసిక వేదనను అనుభవించడం కళ్లారా చూశాం. కొందరికి మంచినీళ్లు తాగటం, కుర్చీలో కూర్చోవడమూ వచ్చేది కాదు. అలాంటి వారికి నేను, అక్కా సహాయం చేసేవాళ్లం. మాలో ఇతరులకు సేవ చేసే గుణం ఉందని అక్కడే మేం గుర్తించాం. మా సంస్థలో సెరిబ్రల్‌ పాల్సీ, డౌన్‌ సిండ్రోమ్‌, ఆటిజం, ఆర్థోపెడిక్‌ వైకల్యాలున్న బాలికలూ ఉన్నారు. దాదాపు వీరిలో పుట్టిన వెంటనే ఆసుపత్రిలో తల్లిదండ్రులు వదిలేసినవారే ఎక్కువ. ఉదాహరణకు ఐదునెలల క్రితం జబల్‌పూర్‌లో డౌన్‌ సిండ్రోమ్‌తో జన్మించిన పాప మా దగ్గరకు వచ్చింది. ఆమె పుట్టగానే తల్లి చనిపోయింది. తండ్రి ఆమెను ఆసుపత్రిలోనే వదిలేసి వెళ్లాడు' అంటోంది సామాజిక సేవలో మాస్టర్స్‌ చేసిన రేఖ.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ..
'కరోనా మహమ్మారి కారణంగా మేం ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డాం. 15 మంది సిబ్బందికి జీతాలు చెల్లించడమూ కష్టమైపోయింది. డైపర్లు, ఆహారం, వైద్య సదుపాయాల కోసం సుమారు ప్రతినెలా నాలుగు లక్షల రూపాయలు ఖర్చవుతాయి. మా దగ్గర ఉండేవారికి క్రాప్ట్‌, అగరుబత్తీలు తయారుచేయడం, చదవడం, రాయడం, తోటపని, క్యాటరింగ్‌, కుట్టుపనిలాంటి వాటిలో శిక్షణ ఇస్తున్నాం' అంటోంది నీలమ్‌ పర్మార్‌. తాను జీవితంలో గెలిస్తూ... మరెందరినో గెలిపిస్తున్న నీలమ్‌, ఆమె కుటుంబ సభ్యులను అభినందించక తప్పదు.