Aug 23,2023 23:49

విజయసాయిరెడ్డికి స్వాగతం పలుకుతున్న ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, నాయకులు

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటకు బుధవారం తొలిసారిగా వచ్చిన రాజ్యసభ సభ్యులు, వైసిపి జాతీయ ప్రధాన కార్యదర్శి, పల్నాడు జిల్లా రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ విజయసాయిరెడ్డికి ఆ పార్టీ నాయకులు, శ్రేణుల నుండి ఘన స్వాగతం లభించింది. వైసిపి పల్నాడు జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నరసరావుపేట- చిలకలూరిపేట రోడ్డులో ఘన స్వాగతం పలికారు. పట్టణంలోకి ప్రవేశించిన విజయసాయిరెడ్డి ప్రకాష్‌ నగర్‌ రిక్షా సెంటర్‌లో టంగుటూరి ప్రకాశం జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్ట మొదటి బారిష్టర్‌ పట్టా పొందిన వ్యక్తి టంగుటూరి ప్రకాశం పంతులని కొనియాడారు. అనంతరం ఎ1 కన్వెన్షన్‌లో పల్నాడు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలతో అంతర్గతంగా సమావేశమయ్యారు. విజయసాయిరెడ్డి పర్యటన రెండ్రోజులుంటుందని వైసిపి వర్గాలు తెలిపాయి. మొదటి రోజు జిల్లాలోని 7 నియోజకవర్గాల పరిధిలో ఉన్న మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నియోజకవర్గ పరిశీలకులతో సమావేశమయ్యారు. రెండో రోజైన గురువారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో నియోజకవర్గాల వారీగా సమీక్షిస్తారని తెలిసింది. సంక్షేమ పథకాలు, పార్టీ స్థానిక పరిస్థితులు గురించి విజయసాయిరెడ్డి చర్చించనున్నారు. ఇటీవల పల్నాడు జిల్లాలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర నిర్వహించడం, ప్రస్తుతం విజయసాయిరెడ్డి సమీక్షలు రాజకీయంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఇదిలా ఉండగా ఆయనకు స్వాగతం పలికిన వారిలో వైసిపి యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి, పౌడా చైర్మన్‌ మిట్టపల్లి రమేష్‌, ఎంపిపి ఎం.శ్రీనివాసరావు, జెడ్‌పిటిసి పి.చిట్టిబాబు, వైసిపి ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు ఉన్నారు.
పల్నాడు జిల్లాలో 2024లోనూ వైసిపి జెండా ఎగరేయాలని విజయసాయిరెడ్డి అన్నారు. జిల్లాలోని 7 నియోజకవర్గాల నాయకులతో ఎ1 కన్వెన్షన్‌లో విడివిడిగా సమావేశమైన అనంతరం అందరితోనూ ఉమ్మడిగా సమావేశం నిర్వహించారు. దీనికి జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో పార్టీ చాలా బలంగా ఉందని, 2019లో జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఒక ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుందని, అదే ఫలితాలను మళ్లీ రాబట్టాలని అన్నారు. ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, రాజకీయంగా అన్ని వర్గాలకూ సిఎం జగన్‌మోహన్‌రెడ్డి పదవులివ్వడంతోపాటు అధికారానికి దూరంగా ఉన్న సామాజిక తరగతులకూ రాజకీయ ప్రాధాన్యం ఇచ్చారన్నారు. ఈ విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని, పార్టీ సంస్ధాగత నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని అన్నారు. ఎన్నికల్లో టిడిపి గెలవలేక అనేక కుట్రలను చేస్తుందని, వీటిపట్ల నాయకులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. గొడవలు పెట్టి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారని, కార్యకర్తలు సంయమనం పాటించేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ గెలుపుకు అవసరమైన ఏ ఒక్క అవకాశాన్ని వదలొద్దన్నారు. సమావేశంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు, నంబూరు శంకర్‌రావు పాల్గొన్నారు.