గంభీరంగా ఉండే గోపాలుడు పాతికేళ్ల యువకుడు. చదువుకున్నాడు కానీ భయస్థుడు. ఎప్పుడూ ఎవరో ఒకరి వెనుకే ఉండేవాడు తప్ప.. ఏ విషయంలోనూ సాహసించేవాడు కాదు.
ఒకసారి నగరంలో ఉన్నతోద్యోగి అయిన మేనమామ ఇంటికి వెళ్ళాడు గోపాలుడు. పెద్ద వ్యాపారి దగ్గర పనిచేస్తుంటాడు ఆయన కుమారుడు. మేనమామ నాయకత్వంలో చాలామంది పనివాళ్ళు కనుసైగలతోనే పనులు చేయడాన్ని చూసి అబ్బురపడ్డాడు. అంతలోనే ఆయనను కలవడానికి వచ్చిన ఒక వ్యక్తి తిరిగి వెళ్ళిపోతూ ప్రదర్శనకు ఉంచిన లోహపు విగ్రహాన్ని సంచిలో వేసుకున్నాడు. అది గోపాలుడు గమనించాడు. వెంటనే విషయాన్ని మేనమామకు చేరవేశాడు. ఆయన సైగ చేయగానే ఒక అనుచరుడు వెళ్లి సంచిని తనిఖీ చేసి, విగ్రహాన్ని బయటకు తీశాడు. గోపాలుడు చెప్పింది నిజమని తేలడంతో అక్కడున్న వారంతా అతని పరిశీలనా శక్తిని మెచ్చుకున్నారు. వారి ప్రశంసలు వినగానే గోపాలుడికి తనమీద తనకు నమ్మకం పెరిగింది.
మరునాడు మేనమామ కొడుకుతో కలిసి అతను పనిచేసే దుకాణానికి వెళ్లాడు గోపాలుడు. అక్కడి పరిసరాలను గమనిస్తూ ఉండగా అతడి దృష్టి ఒకచోట నిలిచింది. ఒక రైతు పది మినుములు, అయిదు పెసల బస్తాలను తెచ్చి గుమాస్తాతో ధర మాట్లాడాడు. బేరం కుదరగానే సరుకు ఇచ్చి, డబ్బు తీసుకున్నాడు. ఆ రైతుకి అధికంగా గుమస్తా డబ్బు చెల్లించినట్టు గ్రహించాడు గోపాలుడు. విషయం చెప్పగానే ''పాతికేళ్లుగా పని చేస్తున్నాను. ఎప్పుడూ తప్పు జరగలేదు. నీకేం తెలుసు నా తెలివి?'' అని కోపగించుకున్నాడు గుమస్తా. వెంటనే ఒక కాగితం తీసుకుని లెక్కతేల్చాడు గోపాలుడు. అప్పటికిగానీ తన తప్పు ఒప్పుకోలేదు గుమస్తా. ఇదంతా గమనిస్తున్న వ్యాపారి గోపాలుడిని అభినందించాడు.
'లెక్కల్లో చురుగ్గా ఉన్నావు. మా తమ్ముడు వ్యాపారం మొదలెడుతున్నాడు. వాడి దగ్గర చేరతావా?' అని అడిగాడు వ్యాపారి. 'మా చుట్టుపక్కల పది ఊర్లలో పిల్లలు చదువుకోడానికి బడి లేదు. నాకైతే సొంతంగా బడి పెట్టాలన్న కోరిక ఉంది. ధైర్యం సరిపోక ఆగిపోయాను' అన్నాడు చేతులు నులుముకుంటూ గోపాలుడు. 'చెయ్యాలనుకున్న పని వెంటనే చేసేయాలి. మంచిపనికి ఆలోచన, ఆలస్యం పనికిరాదు. ఇంతకీ నీకు భయం దేనికి?' అని అడిగాడు వ్యాపారి. 'బడికి పిల్లల్ని పంపుతారో లేదోనని, గురువులు దొరుకుతారో లేదోనని, ఆదాయం సరిపోతుందో లేదోనని, నిర్వహణ కష్టమేమోనని ఇలా అనేక భయాలున్నాయి' నాకు అన్నాడు గోపాలుడు.
వ్యాపారి నవ్వేసి 'ప్రతి పనికీ ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. నేనూ వాటిని అధిగమిస్తూ గొప్ప వ్యాపారినయ్యా. ఎంతోమందికి జీవనోపాధిని కల్పిస్తున్నా. అందుకే రాబోయే కష్టాల గురించి ఆలోచించడం, భయపడడం మానెయ్యాలి. నువ్వు పెట్టబోయే బడికి పాతికశాతం నేను పెట్టుబడిగా పెడతాను. నేనూ విద్యాసేవ చేసినట్లు ఉంటుంది. త్వరగా బడి ప్రారంభించు' అని వెన్నుతట్టాడు వ్యాపారి. ఒక చక్కని మాట గొప్ప లక్ష్యానికి నాంది పలుకుతుందన్నట్టు, వ్యాపారి చేసిన బోధ గోపాలుడు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసేలా చేసింది. త్వరలోనే పాఠశాలను ప్రారంభించాలి అనుకున్నాడు గోపాలుడు.
* నారంశెట్టి ఉమామహేశ్వరరావు, 94907 99203