Mar 05,2023 21:21

cartoon

గెలుపు కోసం ఏమైనా చేద్దాం..!
- అధికార పార్టీ కుటిల యత్నాలు
- చివరికి బెదిరింపులకూ సిద్ధం
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి

      పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు ఎంత వరకైనా సిద్ధపడుతున్నారు. కుటిల యత్నాలతో ఎలాగైనా నెగ్గాలని చూస్తున్నారు. చివరికి బెదిరింపులకు కూడా సిద్ధమవుతున్నారు....
అధికార పక్ష వైసిపి నాయకులు పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులు ఓడిపోతే ప్రభుత్వంపై వ్యతిరేకత బయటపడుతుందని భావిస్తున్నారు. దీంతో తమ అభ్యర్థుల గెలుపు కోసం కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు రోజుల కిందట విద్యాశాఖ అధికారులు ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలకు ఫోన్లు చేశారు. ఎలాగైనా వైసిపి అభ్యర్థులకే ఓట్లు వేయాలని, లేకపోతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇటీవల అధికార పార్టీ నాయకులు నంద్యాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా తమ పట్టభద్రుల అభ్యర్థికే ఓటు వేయాలని ఒక రిటైర్డ్‌ ఇంజనీరును కోరారు. దాంతో ఆయన తనకు ఇష్టం వచ్చిన వారికి ఓటు వేస్తానని చెప్పడంతో ఆయనపై ప్రచారానికి వెళ్లిన వారు దాడి చేశారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు సదరు వ్యక్తి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లగా ఫిర్యాదు తీసుకోకుండా అధికార పార్టీ వారితో ఎందుకు పెట్టుకుంటారు అంటూ చెప్పి పంపడం గమనార్హం. ఇలా అధికార పార్టీ నాయకులు తమ పార్టీ అభ్యర్థులకే ఓటు వేయించడానికి దాడి చేయడానికి కూడా వెనకాడటం లేదు. ఇటీవల విద్యాశాఖాధికారులు నాడు-నేడు పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పైకి అధికారిక సమావేశంలాగా కనిపించినా వైసిపి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించడం కోసమే ఆ సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. వీటితో పాటు ప్రచారంలో పాల్గొన్నారన్న కారణంతో ఎపిటిఎఫ్‌ నాయకులు హృదయరాజుకు విద్యాశాఖ అధికారులు నోటీసులు అందజేశారు. పలు ప్రాంతాల్లో విద్యా శాఖ అధికారుల ద్వారా అధికార పార్టీ నాయకులు ఉపాధ్యాయ సంఘాల నాయకులపై బెదిరింపులకు పాల్పడుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నారు. వైసిపి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయాలని ఫోన్‌ చేసిన ఓ యువతికి ఎందుకు ఓటు వేయాలని, ప్రస్తుత అభ్యర్థి తండ్రి ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏం చేశారో చెప్పాలని సమాధానం ఇచ్చారు. ఈ ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దాంతో వ్యతిరేకత వ్యక్తమవుతోందని గమనించిన అభ్యర్థి పట్టభద్రులకు నగదును పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. అధికార పార్టీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఇప్పటికే జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయులకు టిఫిన్‌ బాక్సులు పంపిణీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం కోసం అధికార పార్టీ నాయకులు చేస్తున్న పనులపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది.