Aug 07,2023 22:00

కలిసి కట్టుగా పనిచేస్తామని అభివాదం చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌ : నియోజకవర్గంలో టిడిపి గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి బోనెల విజయచంద్ర సంయుక్తంగా ప్రకటించారు. సోమవారం కృష్ణపల్లిలో గల మాజీ ఎమ్మెల్యేలు యర్రా కృష్ణమూర్తి, అన్నపూర్ణమ్మ కుటుంబాలతో పాటు, మాజీఎమ్మెల్యే చిరంజీవులు ఇంటికి వెళ్లి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా విజయచంద్ర మాట్లాడుతూ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేసిన పార్టీ అధినేత ఆదేశాల మేరకు తాను ఈ బాధ్యతలు చేపట్టినప్పటికీ, ఇంత వరకూ పార్టీ కోసం కృషి చేసిన నాయకుల సహాయ, సలహాల మేరకు, వారిని కలుపుకుని, తగిన ప్రాధాన్యతనిస్తూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఆక్రమంలోనే నాయకులను, సీనియర్‌ కార్యకర్తలను వ్యక్తిగతంగా కలిసి భవిష్యత్తు కార్యక్రమాల నిర్వహణకు కలిసికట్టుగా కదలిరావాలని కోరారు. కార్యక్రమంలో ఎర్రా కుటుంబానికి చెందిన ఎఎంసి మాజీ చైర్మన్‌ రెడ్డి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులును కలసినట్లు తెలిపారు. అనంతరం చిరంజీవులు కార్యాలయంలో వారిద్దరూ వ్యక్తిగత సమావేశం ఆనంతరం ఇకపై పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేసి, పార్వతీపురంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడించి వచ్చే ఎన్నికలలో విజయ సాధిస్తామని, చంద్రబాబును ముఖ్యమంత్రని చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు జి.వెంకటనాయుడు, బార్నాల సీతారాం, ఎఎంసి మాజీ చైర్మన్‌ రెడ్డి శ్రీనివాసరావు, డాక్టర్‌ గరిమెళ్ల భానుప్రసాద్‌, బలిజిపేట మండల పార్టీ అధ్యక్షులు పెంకి వేణుగోపాలనాయుడు, 7వవార్డు కౌన్సిలర్‌ కోరాడ నారాయణరావు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
ప్రస్తుత ఎమ్మెల్యేకు రిటన్‌ గిఫ్ట్‌ ఇద్దాం
బలిజిపేట: ప్రస్తుత ఎమ్మెల్యే జోగారావుకు రిటన్‌ గిఫ్ట్‌ ఇద్దామని పార్వతీపురం టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి బోనెల విజయ చంద్ర అన్నారు. మండల టిడిపి కార్యాలయంలో మండల అధ్యక్షులు పెంకి వేణు గోపాల్‌ నాయుడు ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధబేరి కార్యక్రమంలో భాగంగా కురుపాం నియోజకవర్గంలోని సర్దార్‌ గౌతు లచ్చన్న తోటపల్లి ప్రాజెక్టును పరిశీలించడానికి ఈనెల 9 న రానున్నారన్నారు. మండలం నుంచి అధిక సంఖ్యలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్ని చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుదామని పిలుపునిచ్చారు. అనంతరం కార్యాలయం నుండి ర్యాలీగా నినాదాలు చేస్తూ స్థానిక హైస్కూల్‌ వద్ద ఉన్న ఎన్‌టిఆర్‌ విగ్రహం వద్దకు వెళ్లి పూలమాల వేసి నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు, సీనియర్‌ నాయకులు గొట్టాపు వెంకట్‌ నాయుడు, సీనియర్‌ నాయకులు బర్నర్‌ సీతారాం, బాబ్జి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
నోండ్రకోనలో భవిష్యత్తుకు గ్యారెంటీ
గుమ్మలక్ష్మీపురం : మండలంలోని నోండ్రకోన గ్రామంలో టిడిపి ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి సీనియర్‌ నాయకులు, ఎమ్మెల్యే టికెట్‌ ఆశావాహి బిడ్డిక పద్మావతి మాట్లాడుతూ వైసిపి నాలుగున్నరేళ్ల పాలనలో ఏజెన్సీలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. టిడిపి అధికారంలోకి వస్తేనే గిరిజన కళ్ళల్లో కాంతులు కనిపిస్తాయని అన్నారు. ప్రజల భవిష్యత్‌ బాగుండాలంటే 2024 ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కొండలరావు, నాగేశ్వరరావు గ్రామస్తులు పాల్గొన్నారు.