ఏ ఊపిర్లనైనా పునరుద్ధరించేందుకు
తంటాలు పడి.. తపన పడ్డావా..
చిరకాలంగా ముడుచుకుని..
ఎవరికోసమో విచ్చుకున్నావా
ఏ కంటి చెమ్మైనా చూసి
చెదిరిపోయావా..
ఏ గాయపడిన గుండెల కోసమో చెమ్మగిల్లావా
ఏ బరువైన మనసు మేఘాన్నైనా
చల్లగాలై స్పశించి.. కురిపించావా
ఏ శిశిర చింతలకైనా
ఓదార్పు చిగురువయ్యావా..
మన్నించి..మినహాయించి
చెమ్మను తుడిచి..
కళ్ల వత్తిని వెలిగించి
రాలుతున్న కొద్దీ మొలవడం నేర్పించావా..
వ్యక్తీకరించలేని ఆవేదననూ..
అకారణమైన ఆవేశాన్ని..
గెలుపు దిశగా మళ్ళించావా
అయితే నీది గెలిచిన హృదయమే..!
గెలుపు దేనికి సంకేతమో..!
చీలికలను అనుసంధానిస్తూ
అవరోధాలను తొలగిస్తూ..
తోవలను సరళం చేస్తూ..
ఆగిపోని నిరీక్షణను అందుకోవడమేనని..!
నువ్వు విజేతవైతే..
అందరూ నీ కొనసాగింపులే..!
- దారల విజయకుమారి
91771 92275