Aug 03,2021 14:44

హైదరాబాద్‌ : తెలుగు రాష్ట్రాల జల వివాదాల నేపధ్యంలో హైదరాబాద్‌ జలసౌధలో కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ సమన్వయ కమిటీ ఈరోజు భేటీ అయింది. గెజిట్‌ గడువు ప్రకారం ప్రాజెక్టుల స్వరూపం ఇతర వివరాలు ఇవ్వాలని కృష్ణా, గోదావరి బోర్డులు ఇరు రాష్ట్రాలను కోరాయి. నోటిఫికేషన్‌లో చేర్చిన ప్రాజెక్టులపై అభ్యంతరాలు ఉన్నట్లు ఏపీ ఈఎన్‌సీ తెలిపింది. ఆ అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నామని ఏపీ ఈఎన్‌సీ పేర్కొంది. కావున అభ్యంతరాలున్న ప్రాజెక్టుల వివరాలు ఇవ్వలేమని ఏపీ ఈఎన్‌సీ తెలిపింది. దీనిపై స్పందించిన బోర్డులు ప్రాజెక్టుల వివరాలు ఇచ్చిన తరువాత అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని సూచించాయి. తమ ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నడుచుకుంటామన్న ఏపీ ఈఎన్‌సీ తెలిపింది. సమన్వయ కమిటీ సమావేశాలు తరచూ జరుగుతాయని బోర్డులు తెలిపాయి. రెండో వారంలో పూర్తి బోర్డు సమావేశాన్ని నిర్వహిస్తామని జీఆర్‌ఎంబీ తెలిపింది.