Sep 01,2022 23:33

డిటికి వినతిపత్రం అందజేస్తున్న ఆయకట్టు రైతులు

ప్రజాశక్తి -ఆనందపురం: నీరు పారే గెడ్డలను అక్రమించేసి, కప్పేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆనందపురం రైతులు కోరతున్నారు. ఈ మేరకు డిప్యూటీ తహశీల్దార్‌ రాజేష్‌, పంచాయతీ కార్యదర్శికి వినతిపత్రం అందజేశారు. ఆనందపురం పంచాయతీ పరిధిలోని శిరిగిడివాని చెరువు, పూర్లవాడిచెరువు పరిధిలో వంద కుటుంబాల ఆయకట్టు రైతులు పంటలను సాగుచేస్తున్నారు. ఈ చెరువులకు గుడిలోవ చానల్‌ నుంచి నీరు అందుతుండగా, కొంత మంది వ్యక్తులు గెడ్డల్లోని నీటిని తోడేసి కప్పేస్తున్నారని, దీంతో చెరువులకు సాగునీరు అందక వీటి పరిధిలోని ఆయకట్టులో సాగుచేస్తున్న పంటలు ప్రశ్నార్థకం కానున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి, సాగునీటి గెడ్డలను కప్పేస్తున్న కబ్జాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఆయకట్టు భూములను పరిరక్షించాలని వేడుకుంటున్నారు.కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మీసాల సత్యనారాయణ, రైతులు ఉమామహేశ్వరరావు, సత్యం, మీసాల నాగేశ్వరరావు, మీసాల సూర్యనారాయణ, మీసాల నరసింగరావు, అప్పలనాయుడు, పైడినాయుడు, శ్రీను, సంపత్‌ వినరు, జయరాం పాల్గొన్నారు.