అధికారులు, నిర్మాణ ఏజెన్సీకి చైర్మన్ ప్రసన్నకుమార్ ఆదేశం
ప్రజాశక్తి- పిఎం-పాలెం : ప్రభుత్వం నిర్ధేశించిన గడువు డిసెంబరు నెలాఖరులోగా టిడ్కో ఇళ్లను అన్ని సౌకర్యాలతో పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని అధికారులు, కాంట్రాక్టింగ్ ఏజెన్సీ హౌసింగ్ ఇన్ఫ్రాను టిడ్కో రాష్ట్ర చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్ ఆదేశించారు. శుక్రవారం అధికారిక పర్యటనలో భాగంగా కొమ్మాది సమీపంలో నిర్మాణంలో ఉన్న టిడ్కో గృహాలను సందర్శించారు.
ఈ సందర్భంగా నగర పరిధిలోని టిడ్కో ఇళ్లకు రుణాలను మంజూరు చేస్తున్న పంజాబ్ నేషనల్ బ్యాంకు విశాఖ సర్కిల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.నీలిమ, సీనియర్ మేనేజర్ శశిధర్‌లు క్షేత్రస్థాయిలో టిడ్కో ఇళ్లు, వాటికి తమ బ్యాంకు ద్వారా అందిస్తున్న రుణం, ఇతర సౌకర్యాలను వివరించారు.ఈ సందర్భంగా బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.నీలిమ వెయ్యి మొక్కలను అందించగా, వారితో కలిసి టిడ్కో కాలనీలో నాటారు. టిడ్కో గృహ నిర్మాణ ప్రగతిపై అధికారులు, కాంట్రాక్టింగ్ ఏజెన్సీని అడిగి తెలుసుకుని, పంజాబ్ బ్యాంకు అందిస్తున్న సహకారంపై సంతృప్తి వ్యక్తం చేశారు. టిడ్కో లబ్ధిదారులకు నగర పరిధిలోని ఐదు శాఖల ద్వారా ఆర్థిక సహకారం రుణాలను అందజేస్తున్నామని డిజిఎం నీలిమ వివరించారు. కార్యక్రమంలో టిడ్కో ఎస్‌ఇ నరసింహమూర్తి, ఇఇ డి.సుధాకర్, సిఎల్‌టిసిలు సంచాన వెంకటరమణ, పి.దేముడుబాబు పాల్గొన్నారు.










